హైదరాబాద్: నానక్‌రాంగూడలోని స్టార్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న 84 ఏళ్ల బామ్మ చెప్పిన దేశభక్తి ఉదంతం శనివారం స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో అక్కడి డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని కంటనీరు పెట్టించింది. సీతారావమ్మ అనే వృద్ధురాలు 1962 నాటి భారత్– చైనా యుద్ధ సమయం నాటి జ్ఞాపకాలను వైద్యులు, సిబ్బందితో గుర్తు చేసుకున్నారు. యుద్ధ సమయంలో మన సైనికులకు అండగా నిలవాలని, దేశ రక్షణ నిధికి తోచిన సాయం చేయాలని భారత ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది.
ఆ సమయంలో సీతారావమ్మ కుటుంబం కూడా దేశం కోసం ముందుకొచ్చింది. తమకు ఎంతో పవిత్రమైన, జీవితాంతం గుర్తుగా దాచుకునే తమ పెళ్లి ఉంగరాన్ని స్వచ్ఛందంగా విరాళం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చందనారెడ్డి మాట్లాడుతూ.. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల మనోధైర్యాన్ని తాము నిత్యం గమనిస్తూనే ఉంటామని.. కానీ.. సీతారావమ్మ 1962 నాటి త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మేమంతా భావోద్వేగానికి గురయ్యామని చెప్పారు. మంచి మనసున్న వ్యక్తికి వైద్యం అందించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.


