కన్నీళ్లలో ‘కార్మిక’లోకం! | Labour Department remains unresponsive to complaints: Telangana | Sakshi
Sakshi News home page

కన్నీళ్లలో ‘కార్మిక’లోకం!

Aug 16 2026 2:02 AM | Updated on Aug 16 2026 2:02 AM

Labour Department remains unresponsive to complaints: Telangana

ఫిర్యాదులపై కనికరించని కార్మీక శాఖ 

ఇష్టారీతిలో తొలగిస్తున్న యాజమాన్యాలు 

బెనిఫిట్లు ఇవ్వకుండా కాలయాపన 

సర్వీసు సర్టీఫికెట్లకూ నోచుకోని దైన్యం 

అధికారులను ఆశ్రయించినా ఫలితం శూన్యం 

లేబర్‌ కోర్టులకు వెళ్లాలంటూ ఉచిత సలహాలు 

లోపాయికారీ ఒప్పందాలతో ఆకస్మిక తనిఖీలకూ అనాసక్తి

సూర్యాపేట జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ బిస్కెట్‌ కంపెనీలో ప్యాకింగ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. రెండేళ్ల క్రితం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో మధ్యలో రోడ్డు ప్రమాదం జరగడంతో పక్కటెముకలు విరిగాయి. దీంతో విశ్రాంతి తీసుకోవాలనే వైద్యుల సూచన మేరకు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. మూడు నెలల విశ్రాంతి అనంతరం తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్లిన సత్యనారాయణకు యాజమాన్యం అనుమతివ్వలేదు. కొంతకాలం వాయిదా వేస్తూ వచ్చిన యాజమాన్యం... ఓ రోజు విధుల నుంచి తొలగించినట్లు తేల్చిచెప్పారు. 14సంవత్సరాల పాటు పనిచేసిన తనకు ఎక్స్‌పీరియన్స్‌ సర్టీఫికెట్‌ అయినా ఇవ్వాలని కోరినప్పటికీ యాజమాన్యం నిరాకరించింది. తనకు రావాల్సిన గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్‌ కూడా ఇవ్వకపోవడంతో కార్మీకశాఖను ఆశ్రయించారు. రెండు సంవత్సరాలుగా కార్మీక శాఖ కమిషనరేట్‌ చుట్టూ తిరుగుతున్నా తనకు రావాల్సిన బెనిఫిట్స్‌ విఫయంలో ఎలాంటి పురోగతి లేదు. 

వనపర్తి జిల్లాకు చెందిన సంగీత ఓ ఫుడ్‌ కంపెనీలో ఫుడ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ సిస్టం(ఎఫ్‌ఎస్‌ఎంఎస్‌) కోఆర్డినేటర్‌గా 2019 సెప్టెంబర్ నుంచి పనిచేసింది. గతేడాది ఏప్రిల్‌లో కంపెనీ యాజమాన్యం పిలిచి రెండు నెలలు సెలవులో వెళ్లాలని సూచించింది. యాజమాన్యం సూచించినట్లే రెండు నెలల సెలవు ముగించుకుని తిరిగి విధుల్లో చేరేందుకు ప్రయత్నించగా తనను విధుల నుంచి తొలగించినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. కనీస సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించడంపై ప్రశ్నించిన సంగీత ఆ తర్వాత తనకు రావాల్సిన బెనిఫిట్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అదేవిధంగా సర్వీస్‌ సర్టీఫికెట్‌ కూడా ఇవ్వాలని కోరింది. కానీ ఆమెకు బెనిఫిట్స్, సర్వీస్‌ సర్టీఫికెట్‌ ఇచ్చేందుకు యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. దీంతో ఆమె కార్మిక శాఖను కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కార్మిక శాఖ ఇరువర్గాలతో మాట్లాడినా సమస్యకు కొలిక్కి రాలేదు. దీంతో సంగీత ఇప్పటికీ కార్మీక శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: కార్మీకుల లిఖితపూర్వక ఫిర్యాదులపై కార్మీక శాఖ అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నా­రు. కంపెనీ యాజమాన్యంతో నెలకొన్న వివాదాలు, హ­క్కు­గా అందాల్సిన లబ్ధి, ఇతర అంశాలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే కార్మీక శాఖ సత్వర స్పందనతో పాటు తగిన చర్యలకు ఆదేశాలు జారీ చేయాలి. లేబర్‌కోడ్‌ అందాల్సిన లబ్ధిని అందించేందుకు మద్యవర్తిత్వం నెరపాలి. అలాకాకుండా యాజమాన్యాలతో సానుకూలంగా ఉంటూ ఫిర్యాదుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కార్మీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా వాటిని పరిష్కరించకపోవడంతో కార్మీకు­లు ఆందోళనకు దిగుతున్న సందర్భాలు నెలకొంటున్నా­యి.

ప్రధానంగా వేతన చెల్లింపుల్లో జాప్యం, అర్థంతరంగా పని నుంచి తొలగింపు, గ్రాట్యుటీ చెల్లించకపోవడం, ఈఎస్‌­ఐ, పీఎఫ్‌ చెల్లించకపోవడం తదితర కేటగిరీలకు చెందినవే అధికంగా ఉంటున్నాయి. ఈ ఫిర్యాదు అందిన వెంట­నే ప్రత్యేకంగా ఒక తేదీని నిర్దేశించి ఆరోజున ఫిర్యాదు దా­రుడు, యాజమాన్యాన్ని పిలిచి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు కార్మీక శాఖ చర్యలు చేపట్టాలి. అలా కాకుండా లేబర్‌ కోర్టుకు వెళ్లాలని సూచించి చేతులు దులుపుకునేలా అధికారులు వ్యవహరించడంతో ఫిర్యాదుదారులు లబోదిబోమంటున్నారు. మరోవైపు తమకు వచ్చిన ఫిర్యాదును కార్మీక శాఖ పరిధిలోనే పరిష్కరించకుండా తాత్సారం చేయడం, ఆ తర్వాత వాటిని కోర్టుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించడం జరుగుతోంది.

కార్మీక శాఖ పరిధి దాటి పోరాడాలంటే కార్మీకుడికి ఆర్థిక భారం మీదపడుతుంది. ప్రత్యేకంగా లాయర్‌ను నియమించుకోవాలి. అందుకు ఫీజులు చెల్లించడం, కోర్టు వాయిదాల ప్రకారం తిరగడం... ఇదంతా దీర్ఘకాల వ్యవహారం. అందుకు భయపడి కార్మీక శాఖ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకోవాలనేది ఫిర్యాదుదారుల భావన. చర్చలు జరిపి పరిష్కరించేందుకు అధికారులు నిరాకరించడం, కొందరు యాజమాన్యాలతో లోపాయికారంగా వ్యవహరించడంతో ఫిర్యాదు పరిష్కారం ముందుకు సాగడం లేదు. మరోవైపు పని ప్రదేశంలో కార్మీకుల వసతులు, సంక్షేమం తదిరత అంశాలపై కార్మీక శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.

కానీ క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు కార్మీక శాఖ ఉన్నతాధికారులు ఆసక్తి చూపడం లేదు. తనిఖీలు నిర్వహించాలని కార్మీక సంఘాలు, వివిధ ట్రేడ్‌ యూనియన్లు లిఖిత పూర్వ ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల మాత్రం తాత్సారం చేస్తున్నారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన ట్రేడ్‌ యూనియన్‌(ఐఎన్‌టీయూసీ) నాయకుడు కొన్ని కంపెనీల్లో కార్మీకుల సమస్యలను ప్రస్తావిస్తూ క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని కోరారు. కానీ ఉన్నతాధికారి మా­త్రం ఈ తనిఖీలకు తక్షణ ఆదేశాలు జారీ చేయకుండా ఫిర్యాదుపై ఆరా తీయాలని సూచించడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement