సంగారెడ్డి: బీజేపీ, బీఆర్‌ఎస్ వేర్వేరు కాదని, నాణేనికి బొమ్మ, బొరుసులాంటివని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో ఆయన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ప్లాస్టిక్ కార్డు కాదని, పేదల ఆత్మగౌరవమని తెలిపారు.
‘‘కేసీఆర్‌కు నేను సవాల్ విసురుతున్నాను. రైతులకు మేము చేసిన మేలు ఏంటో మీరు చేసిన అన్యాయమేంటో చర్చకు సిద్ధం. సంక్షేమ పథకాలపై కొందరు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. చర్చిద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం వరి వేసిన రైతులకు బోనస్ ఇచ్చింది’’ అని రేవంత్ రెడ‍్డి వ్యాఖ్యానించారు.
పేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలని ఆ రెండు పార్టీలు ఏనాడైనా ఆలోచించాయా? అని రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘పేదల కోసం ఇందిరా గాంధీ అహర్నిశలు పాటుపడ్డారు. రైతులకు మేం చేసిన మేలు ఏంటో మీరు చేసిన మేలు ఏంటో చర్చకు సిద్ధం. పేదల కోసమే రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. సంక్షేమ పథకాలపై కొందరు ప్రశ్నిస్తున్నారు. 3.48 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. బీఆర్‌ఎస్ సన్నబియ్యం ఇవ్వాలని పదేళ్లలో ఏనాడూ ఆలోచించలేదు’’ అని చెప‍్పారు.
2034 వరకు మీ ఆశీర్వాదం ఉండాలి
విధ్వంసం అయిన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘అన్నం తిన్నా తినకపోయినా కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కడుతూ అప్పుల ఊబిలో నుంచి బయటికి వస్తున్నా. ఓ పూట ఆలస్యం కావచ్చు మీ హక్కులను భంగం కలగనివ్వం. బీఆర్‌ఎస్ పాలన, మా పాలనను అంచనా వేయండి. దేశంలో మొదటిసారి కులగణన చేసేంది కాంగ్రెస్. 2034 వరకు మీ ఆశీర్వాదం ఉండాలి. మీ ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏమి లేదు’’ అని చెప్పారు.


