డిసెంబర్‌లో ఇన్వెస్ట్‌ తెలంగాణ! | Several decisions taken at the Telangana Cabinet meeting | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో ఇన్వెస్ట్‌ తెలంగాణ!

Aug 15 2026 6:20 AM | Updated on Aug 15 2026 6:20 AM

Several decisions taken at the Telangana Cabinet meeting

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రపంచానికి చాటేలా సదస్సు 

నేటి నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ 

ఈ ఏడాది నుంచి ఏడు రకాల సన్నాలకే రూ.500 బోనస్‌  

17.54 లక్షల మెట్రిక్‌ టన్నుల మిగులు ధాన్యం ఈ–వేలం 

కొత్తగా 7 యంగ్‌ ఇండియా స్కూల్స్‌.. హిల్ట్‌ పాలసీ గడువు పొడిగింపు 

రూ. 2,100 కోట్లతో మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ రెండో దశ  

సాక్షి, హైదరాబాద్‌: గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0’ నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు తేదీలను ఖరారు చేసింది. ఈసారి ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ థీమ్‌తో డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. అనంతరం రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. 

ఆవిష్కరణల ఎగ్జిబిషన్, స్టాల్స్‌
‘సదస్సు నిర్వహణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్‌ వెంకట­స్వామి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘంతో పాటు ప్రత్యే­క కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గత ఏడాది ‘తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌’ ఆవిష్కరించగా, ఈసారి సదస్సులో ఫ్యూచర్‌ సిటీ ప్రణాళిక­ను ఆవిష్కరించనుంది. ప్రధానంగా రాష్ట్రంలో రక్షణ, ఏరో స్పే­స్, ఫార్మా రంగాల్లో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అ­పా­రమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈసారి సదస్సు జరుగుతుంది. వివిధ రంగాల్లో ఇప్పటికే తెలంగాణ స్టార్టప్‌లు, పరిశ్రమలు సాధించిన విజయాలు.. వివిధ రంగాల కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఎగ్జిబిషన్, స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

స్మార్ట్‌ రేషన్‌కార్డులు రెడీ..
స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు స్మార్ట్‌ కార్డుల పంపిణీని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్మార్ట్‌ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ శని­వా­రం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లో ప్రా­రంభిస్తారు. జిల్లాల్లో సంబంధిత జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్‌కార్డు లబ్ధిదారులుంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్‌కార్డులు జారీ చేయడంతో 62 లక్షల మందికి కొత్తగా లబ్ధి చేకూర్చింది. మొత్తం 3 కోట్ల 42 లక్షలకు లబ్ధిదారులు పెరిగారు. వీరికి స్మార్ట్‌ కార్డుల జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.   

సన్న ధాన్యం సాగుపై రైతులకు అవగాహన
ప్రస్తుత వానాకాలంలో ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రో­త్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రైతులకు అవ­గాహన కల్పించడానికి అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ ఏడు రకాల సన్నాలకే రూ.500 బోనస్‌ చెల్లించాలని కేబినెట్‌ తీర్మానించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 81.16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.

అందులో 63.62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,389 కనీస ధరతో సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఈ–వేలం ద్వారా విక్రయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబట్టుకున్న నేపథ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాల్‌కు కేంద్రం నిర్దేశించిన కనీస ధర రూ.2,389ను ప్రాథమిక ధరగా నిర్ణయించి ఈ– వేలం ద్వారా అమ్మాలని మంత్రివర్గం నిర్ణయించింది.  

స్కిల్స్‌ వర్సిటీ పరిధిలోకి ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్‌లు
సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిని తెలంగాణ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ నుంచి తొలగించి యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో తొలివిడతగా 113 నియో­జకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్స్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా,  కొత్త వాటితో కలిపి ఇప్పటివరకు మొత్తం 86 యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌లకు అనుమతులు మంజూరయ్యాయి. 

క్యూర్‌లో ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల రాయితీ
కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి హైదరాబాద్‌ను గ్రీన్‌ సిటీగా మార్చే దిశగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్‌ ఆటోరిక్షాలున్నాయి. వీటిని ఈవీలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ స్కీం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద  అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్టంగా రూ.1.5 లక్షల సబ్సిడీ అందిస్తారు.  ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్‌ కిట్‌ అమర్చుకోవటం/ పాత వాహనాన్ని స్క్రాప్‌ చేసి కొత్త విద్యుత్‌ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నారు.

హైదరాబాద్‌ సిటీ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన హిల్ట్‌ పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు అంటే అక్టోబర్‌ 31 వరకు పొడిగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను రూ.2,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గూడెందొడ్డి పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌  నియామకానికి ఆమోదం తెలిపింది.

వెబ్‌సైట్‌లో నిషేధిత భూముల జాబితా: మంత్రి పొంగులేటి 
ప్రభుత్వ స్థలాలు, న్యాయ వివాదాల్లో ఉన్న భూములు మి­నహా ఇతర ప్రైవేటు భూములను 22ఏ–నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తామని మంత్రి పొంగులేటి..విలేకరుల ప్రశ్నకు జవాబుగా చెప్పారు. జిల్లా కలెక్టర్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఇప్పటికే ఈ విషయంలో సూచనలు జారీ చేశామన్నారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న అన్ని భూముల వివరాలను శుక్రవారం సాయంత్రంలోగా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశించామన్నారు. క్యూర్‌ ఏరియా పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లను ఆవపవద్దని రిజిస్ట్రార్లను ఆదేశించామని తెలిపారు.

కేబినెట్‌ నిర్ణయాలను విలేకరుల సమావేశంలో వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రి అడ్లూరి, ఎంపీ రఘురాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement