గోల్కొండ కోటలో జాతీయ జెండాకు వందనం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణను ఆదర్శంగా తీసుకునే కేంద్రం జనగణనలో కులగణనను చేర్చింది
త్వరలోనే ఆన్‌లైన్‌లో ప్రజావాణి... ఎక్కడి నుంచైనా అర్జీలు పంపవచ్చు
విద్యాసంస్థల్లో వివక్ష నిర్మూలనకు త్వరలో రోహిత్ వేముల చట్టం
సినీ కార్మీకుల కోసం సంక్షేమ బోర్డు
2.5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు
మూసీ, ఫ్యూచర్ సిటీ నిర్వాసితులకు పరిహారం... త్వరలో నెక్స్‌ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ
స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
గోల్కొండ కోటపై జాతీయజెండాను ఆవిష్కరించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కులగణన చేసి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. జనగణనలో కులగణన చే యాలన్న తెలంగాణ ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో చేసిన కులగణన నివేదికను కేంద్రానికి పంపించాం. దీనితో కేంద్రం కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవడానికి దోహదపడింది. దేశంలోనే సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను పకడ్బందీగా నిర్వహించి కులాల వారీగా సామాజిక స్థితిగతులను వెల్లడించాం. 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి వ ర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపించాం. చివరగా దేశంలో 1931లో బ్రిటిష్ పాలనలో కులగణన జరిగింది’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఆయన పరేడ్ మైదానంలో అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ఇక ఆన్‌లైన్‌లో ప్రజావాణి..
ఆన్‌లైన్ ప్రజావాణి పోర్టల్ ప్రారంభించి త్వరలోనే ఇక ఆన్‌లైన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఆర్జీలను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. వాటి పరిష్కార పురోగతిని ప్రత్యేక డ్యాష్‌బోర్డు ద్వారా నిరంతర పర్యవేక్షిస్తాం. ఈనెల 17 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ స్కీమ్ అమల్లోకి తెచ్చాం. టీ–ఫైబర్ ద్వారా భారత్ నెట్ రెండో దశలో 8,895 గ్రామపంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాం.
మూసీ బాధితులకు నష్టం కలిగించం...
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి మొత్తం వ్యయంలో 12.4 శాతం కేటాయించాం. కనీస వేతనాలను సవరించి 1.11 కోట్ల మంది కార్మీకులకు ప్రయోజనం కల్పించాం. గిగ్ కార్మీకులకు చట్టబద్ధ గుర్తింపు కల్పించాం. సినీ కార్మీకుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాం. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల తెలంగాణ చట్టానికి రూపకల్పన చేస్తున్నాం. 55 కి.మీ. పరిధిలో మూసీ పునరుజ్జీవనంలో భాగంగా 39 కొత్త ఎస్టీపీల నిర్మాణంతోపాటు 2.5 టీఎంసీల గోదావరి నీళ్లను మూసీకి తరలించే ప్రణాళికను తీసుకెళ్తున్నాం. మూసీ పరీవాహకంలో నివాసితులకు ఎలాంటి కష్టం, నష్టం కలిగించం. మీ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది.
ఫ్యూచర్ సిటీ రైతులకు పరిహారం
రాష్ట్రాన్ని 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ జీడీపీలో రాష్ట్రవాటాను 10 శాతానికి పెంచే దిశగా ముందుకు సాగుతున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్–జీరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. 30వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి భూములిచ్చిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన రాష్ట్ర వాటా సాధించే విషయంలో రాజీ లేదు. అటు తుమ్మడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. టీజీ–ఐపాస్‌తో రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి. నెక్స్‌ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ–2026తో తెలంగాణను ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో నిలబెట్టేలా దిశా నిర్దేశం చేసుకున్నాం.
కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ టవర్స్..
తొలి దశలో 4.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షల ఇందిమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నాం. అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెట్టాం. కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ విద్య ప్రారంభించాం. ప్రభుత్వ శాఖల్లో 72 వేల ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాం. దక్షిణ భారత దేశంలో తొలి రోబోటిక్ కిడ్నీ మార్పిడి నిర్వహించిన తొలి ప్రభుత్వ ఆస్పత్రికి నిమ్స్ చరిత్ర సృష్టించింది. డ్రగ్స్, ఆహార కల్తీని ఎదుర్కొనేందుకు టీజీ సేఫ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేసి కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణకి టీజీ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకున్నాం.


