2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపు
ఏడు రకాల శక్తులు కలిస్తే ఇది అసాధ్యం కాదని భరోసా
అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించిన ప్రధాని
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సిద్ధికి వందేళ్లు నిండేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. పన్నెండేళ్లలో సాధించిన పురోగతిని వివరిస్తూనే.. 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించేందుకు ఒక్కొక్కరూ కంకణం కట్టుకుని తమవంతు తోడ్పాటు, కృషి చేయాలని ఆయన ఎర్రకోట వేదికగా శనివారం జరిగిన 80వ స్వాతంత్య్రోత్సవ వేడుకల్లో కోరారు.
ఏడు రకాల శక్తులు కలిస్తే (సప్త ధార) ఇది అసాధ్యం కానేకాదని భరోసానిచ్చిన మోదీ.. లక్ష్యసాధనకు సాధించాల్సిన ప్రగతిపై కూడా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించారు. దేశీ కంపెనీల్లో కనీసం యాభై ఫార్చ్యూన్ 500 జాబితాలో చోటు సంపాదించుకోవాలని, అంతర్జాతీయంగా టాప్ 5 బ్యాంకుల్లో ఒకటైనా భారత్‌ది అయి ఉండాలని స్పష్టం చేశారు.
ప్రపంచ భవిష్యత్తును శాసించనున్న కృత్రిమ మేధ రంగంలో అగ్రస్థానంలో నిలిచే లక్ష్యంతో వచ్చే ఏడాది కోటి మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ప్రకటించారు. శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు విభేదాలు మరచి రాజకీయ పార్టీలన్నీ ముందుకు రావాలని కోరారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో యువత నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.
దేశంలో సాయుధ నక్సలిజం లేకుండా పోయినా ‘దిమాగీ నక్సల్స్’ఇంకా ఉన్నారని హెచ్చరించారు. దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాజధాని ఢిల్లీలో ఘనంగా మొదలయ్యాయి. శనివారం ఉదయం 6.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాం«దీకి నివాళులు అర్పించి ఎర్రకోటకు చేరుకున్నారు. రక్షణశాఖ కార్యదర్శి, గార్డ్ ఆఫ్ హానర్ కమాండర్ సుమారు 7.15 గంటల ప్రాంతంలో ప్రధానిని ఆహ్వానించారు.
ఆ తరువాత ప్రధాని గార్డ్ ఆఫ్ హానర్‌ను అందుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని చిరస్మరణీయం చేస్తూ ఆర్మీబ్యాండ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మొదటిసారి దీన్ని ఆలపించడం, ఆ తరువాత 21 తుపాకులతో ‘రాష్ట్రీయ సెల్యూట్’, జాతీయ గీతాలాపన జరిగాయి. ఇదే సమయంలో భారతీయ వాయుసేనకు చెందిన రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు వేదికపై పుష్ఫవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని, మరోటి ‘వందే మాతరం’అని రాసి ఉన్న జెండాను మోసుకెళుతూ కనిపించాయి. అనంతరం 7.40 గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం భారతీయులు అందరి లక్ష్యం కావాలని నిర్దేశించిన ప్రధాని మోదీ ఎర్రకోటపై తొలిసారి వందేమాతరం పాడటంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి దేశం దన్నుగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రధాని గత పన్నెండేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని సోదాహరణంగా వివరించారు.
అనంతరం వికసిత భారత లక్ష్యాన్ని అందుకునేందుకు సాయం చేయగల సప్తధార శక్తులను ప్రకటించారు. అంతేకాకుండా దేశం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేందుకు వేయాల్సిన ముందడుగులను వివరించారు. యువత ఉన్నత శిఖరాలను అందుకునేందుకు దేశం అండగా ఉంటుందని చెప్పిన ప్రధాని మత్తుమందుల మహమ్మారిని పారదోలే లక్ష్యంతో వలంటీర్లు, ఎన్జీవోలు, సామాజిక, సాంస్కృతిక సంస్థలు, ఆధ్యాతి్మక నాయకులతో కలిసి వంద వారాల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు.
పురోగతి బాటలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో గత పన్నెండేళ్లలో దేశం సాధించిన పురోగతిని ఇలా వివరించారు...
→ రక్షణ రంగ ఉత్పత్తులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి.
→ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల్లో పురోగతి ఐదు రెట్లు
→ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల తయారీలో పెరుగుదల ఏడు రెట్లు.
→ ఆధునిక రైల్వే కోచ్‌ల ఉత్పత్తి 21 రెట్లు పెరిగింది.
→ మొబైల్ ఫోన్ల తయారీలో పెరుగుదల 33 రెట్లు ఎక్కువైంది.
→ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువైంది.
→ పేటెంట్లు కూడా 4 రెట్లు ఎక్కువయ్యాయి.
→ డిజిటల్ లావాదేవీలు దాదాపు 100 రెట్లు పెరిగాయి.
→ నల్లాల ద్వారా తాగునీటి కనెక్షన్లు గతం కంటే 15 రెట్లు వేగంగా అందిస్తున్నాం.
→ గ్యాస్ కనెక్షన్లు అందించే వేగం కూడా ఆరు రెట్లు ఎక్కువైంది.
→ స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం నాలుగు రెట్లు వేగంగా జరుగుతోంది.
→ పీఎం ఆవాస్ యోజన కింద పేదల కోసం ఇళ్ల నిర్మాణ వేగం మూడు రెట్లు పుంజుకుంది.
→ పేదరికం నుంచి బయటపడ్డ వారి సంఖ్య 25 కోట్లు.
→ ‘‘ఫ్రాజైల్ ఫైవ్’’నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుదల
→ దేశం మొత్తమ్మీద 2.5 లక్షలకు పైగా స్టార్టప్‌లు
→ 650 కొత్త యూనివర్సిటీల స్థాపన
లక్ష్య నిర్దేశం
2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు భారతీయ సంస్థలు, బ్రాండ్లు పలు లక్ష్యాలను సాధించాలి. ఫార్చ్యూన్ 500లో 50 భారతీయ కంపెనీలు ఉండాలి. బ్యాంకులు, ఫార్మా, లాఫర్మ్‌లు, రేటింగ్ ఏజెన్సీలు, ఐటీ, కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థలు కూడా ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరాలి. భారతీయ బ్రాండ్లు విశ్వాసానికి ప్రతీకలుగా మారాలి. దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలన్నీ కలిసికట్టుగా పని చేయాలి.
భారతీయ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీలు కొత్త ఉపాధి అవకాశాలకు దారులు తెరుస్తోంది. 2036 ఒలింపిక్స్, 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు దేశం సిద్ధం. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్, శక్తి భద్రతపై దృష్టి సారించాలి మూడు సెమీకండక్టర్ ప్లాంట్లలో ఉత్పత్తి మొదలైంది. వచ్చే ఏడు, ఎనిమిదేళ్లలో మరో ఎనిమిది ప్లాంట్ల స్థాపన. 2047 నాటికి వంద గిగావాట్ల అణు శక్తి లక్ష్యం.
ఈ దశాబ్దంలో ఐదు కొత్త అణు రియాక్టర్లు ప్రారంభం. సౌర శక్తి సామర్థ్యం రెండు గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు వృద్ధి. పీఎం సూర్య ఘర్ పథకం కింద 50 లక్షలకు పైగా రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు. యువత, క్రీడలు, మహిళా సాధికారత దేశంలో 2.5 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. రూ.లక్ష కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్. డ్రగ్–ఫ్రీ ఇండియా జాతీయ మిషన్‌గా మారాలి.
సప్తధార: ఏడు శక్తి ప్రవాహాలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ‘‘సప్తధార’’అనే ఏడు శక్తి ప్రవాహాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రానున్న ఐదు, ఏడేళ్లు చాలా కీలకమని, ప్రజలు పని సంస్కృతి తోపాటు మైండ్‌సెట్‌నూ మార్చుకుని దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలిని అన్నారు.
ప్రధాని వివరించిన సప్తధారల వివరాలు...
→ తయారీ శక్తి: డిజైన్ నుంచి తయారీ వరకు మొత్తం అన్ని దశలూ భారత్‌లోనే పూర్తవ్వాలి. నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారాలి. ఖర్చు, నాణ్యతల పరంగా భారతీయ పరిశ్రమలు ప్రపంచ దేశాలతో పోటీపడాలి. నమ్మదగ్గ, యూజర్ ఫ్రెండ్లీ, ఆకర్శణీయమైన ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా పనిచేయాలి.
→ వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్: చిరుధాన్యాలు, మసాలా దినుసులు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహారాలను ప్రపంచ బ్రాండ్లుగా మార్చాలి. రసాయన–రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల కారణంగా అందుబాటులోకి వచ్చిన ప్రపంచ మార్కెట్లను రైతులు సది్వనియోగం చేసుకోవాలి. పొలాల నుంచి నేరుగా ఎగుమతులు జరగాలి
→ టెక్నాలజీ, ఇన్నొవేషన్: ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష ప్రయోగాలు, రోబోటిక్స్, డేటా సెంటర్లలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేలా ఎదగాలి యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రపంచానికి మార్గదర్శకం కావాలి. 6జీ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయాలి.
→ గతి శక్తి: హై–స్పీడ్ రైలు, ఆధునిక హైవేలు, అంతర్గత జలమార్గాలు, ప్రపంచ స్థాయి విమానాశ్రయాలు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ వ్యవస్థల ద్వారా నగరాలను అనుసంధానించాలి. పోర్టులను పోర్ట్–ఆధారిత అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలి.
→ రక్షణ శక్తి: రక్షణ రంగంలో దేశం స్వావలంబన సాధించడంతోపాటు ప్రపంచదేశాలకు రక్షణ ఉత్పత్తులను సరఫరా చేసేదిగా ఎదగాలి. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్లతోపాటు హైపర్ సోనిక్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీ రంగంలో భారత యువత కీలక పాత్ర పోషించాలి.
→ గ్రీన్, బ్లూ ఎకానమీ: గ్రీన్ హైడ్రోజన్, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇంధన నిల్వ, పర్యావరణ హితమైన రవాణా, తయారీల కోసం కృషి జరగాలి. మత్స్య, తీరప్రాంత పర్యాటకం, ఓషన్ టెక్నాలజీల సాయంతో దేశం బ్లూ ఎకానమీలోనూ అగ్రస్థానానికి చేరవచ్చు. దేశ సంపదైన సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉపాధి, ఆర్థిక వృద్ధికి అవకాశాలు సృష్టికి అనుకూలం.
→ సాఫ్ట్ పవర్: భారతదేశ సాఫ్ట్ పవర్‌కు యోగా, ఆయుర్వేదం, ఆధ్యాతి్మకత, ఆరోగ్య సంరక్షణ, హస్తకళలు, సంస్కృతి, సినిమా, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్‌లు నిదర్శనాలు. యువతకు అపార అవకాశాలు కల్పించగల సత్తా వీటికి ఉంది. హెల్త్ టూరిజమ్ ప్రోత్సాహానికి ‘హీల్ ఇన్ ఇండియా’ఉపయోగపడుతుంది. వేవ్స్ సమ్మిట్ దేశ సృజనాత్మక, వినోద పరిశ్రమల సత్తాను చాటింది. వందకు పైగా ఉన్న జాతీయ పార్కులతోపాటు వన్యప్రాణి సంపద పర్యాటక రంగాన్ని ఆకర్శించేందుకు సాయపడుతుంది. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు, కచేరీలు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగలవు.


