సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం అధినేత, ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో సీఎం విజయ్ ఓ చిన్న కథ చెబుతూ.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి కౌంటర్‌గా చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో తండ్రి ఎక్కడ ఉన్నారని వెతికే బదులు..అంటూ.. సీఎం విజయ్ తల్లిని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు నేరుగా సీఎం విజయ్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన తల్లిని ఉద్దేశించినవేనంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలపై అధికార టీవీకే పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి అనాగరిక, అనుచిత వ్యాఖ్యలు బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తికి తగవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్‌మోహన్ తదితరులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వయంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కూడా నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించారు. రాజకీయంగా విధానాలను, ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పులేదని, కానీ ఒక నాయకుడి కుటుంబాన్ని, ప్రత్యేకించి తల్లిని కించపరిచేలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది తమిళనాడు రాజకీయ సంస్కృతిని దిగజార్చేలా ఉందని మండిపడ్డారు.
తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ.. తాను ఎవరిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆ వ్యాఖ్యలు చేయలేదని, తన ప్రసంగాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించారని వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ మాతృమూర్తిని, మాతృభాషను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఏదేమైనా, విజయ్ 'తండ్రి' వ్యాఖ్యలకు బీజేపీ 'అమ్మ' అంటూ ఇచ్చిన కౌంటర్ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


