లక్నో: ఉత్తరప్రదేశ్ బారాబంకీలో చోటుచేసుకున్న భయానక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమారు 15 అడుగుల పొడవైన భారీ కొండచిలువ ఒక మటన్ షాపులోకి దూరి, అక్కడి మేకను తినేందుకు ప్రయత్నించింది. దీంతో షాపు యజమానితో పాటు అందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే, అదే సమయంలో విపరీతమైన మద్యం మత్తులో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి, ఆ కొండచిలువను చూసి ఏమాత్రం భయపడలేదు సరికదా.. దాన్ని తన మెడలో వేసుకొని వీరంగం సృష్టించాడు. కొండచిలువతో ఆ వ్యక్తి చేసిన ఈ విన్యాసాలు స్థానికులను తీవ్రంగా కలవరపాటుకు గురి చేశాయి.
బారాబంకీలోని ఒక మటన్ షాపులోకి అనుకోకుండా ప్రవేశించిన ఆ భారీ కొండచిలువ, దుకాణంలో ఉన్న మేకల్లో ఒకదానిని మింగేసేందుకు యత్నించింది. ఇదే సమయంలో మద్యం మత్తులో ఉన్న సురేష్ అనే వ్యక్తి ఆ మటన్ షాపు వైపు వచ్చాడు. భారీ కొండచిలువను చూసి అందరూ భయంతో పారిపోతుంటే ఇతను మాత్రం ఏమాత్రం వెనకాడకుండా ఖాళీ చేతులతో దాన్ని పట్టుకున్నాడు. సురేష్ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడంతో, ఆ పాము తిరగబడి అతడి చేతిని కొరికింది.
కొండచిలువలకు విషం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయినప్పటికీ ఏమాత్రం లెక్కచేయని సురేష్, ఆ భారీ కొండచిలువను తన భుజాలపై వేసుకుని, మెడ చుట్టూ దండలా చుట్టుకుని నానా హంగామా సృష్టించాడు. ఈ విచిత్ర దృశ్యాన్ని చూసేందుకు జనం భారీగా గుమిగూడారు. కొందరు దీన్ని తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. కొంతసేపటి తర్వాత మత్తు దిగి తేరుకున్న సురేష్, ఆ పామును ఒక పెద్ద డబ్బాలో బంధించాడు. అనంతరం దానిని తీసుకెళ్లి సమీపంలోని ఒక కాలువలో వదిలిపెట్టాడు. ఆ డబ్బాలో నుంచి బయటకు వచ్చిన కొండ చిలువ తన తలను సుమారు 3 అడుగుల ఎత్తుకు లేపి విన్యాసాలు చేసింది.


