2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక దిశానిర్దేశం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఎర్రకోట నుంచి జాతి ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశ ప్రగతికి ఏడు ప్రధాన శక్తులు అవసరమని పేర్కొన్నారు. వీటినే 'సప్తధార'గా అభివర్ణించారు.
ఉత్పాదక శక్తి (Manufacturing power)
మోదీ 'సప్తధార'లో మొదటి స్థానాన్ని తయారీ రంగానికి ఇచ్చారు. చిన్న వస్తువుల నుంచి భారీ పరిశ్రమల వరకు సాధ్యమైనంత ఎక్కువగా భారత్‌లోనే తయారు చేయాలి అనేది ప్రధాని ఆలోచన. కేవలం ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా.. డిజైన్, తయారీ, నాణ్యత, సరఫరా వంటి మొత్తం విలువ గొలుసును దేశంలోనే అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాలకు భారత్ ఒక నమ్మకమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామికవేత్తలు ధరతో పాటు నాణ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై కూడా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయం, ఆహార ఉత్పత్తి (Agriculture and food production)
రెండో శక్తిగా వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ప్రధాని ప్రస్తావించారు. మన రైతులు కేవలం దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడకుండా.. ప్రపంచ మార్కెట్‌ను కూడా లక్ష్యంగా చేసుకోవాలని ఆయన అన్నారు. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహార పదార్థాలు, రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంటే.. పొలంలో పంట పండించడం దగ్గరే ప్రక్రియ ఆగిపోకూడదు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఎగుమతుల వరకు పూర్తి వ్యవస్థను అభివృద్ధి చేయాలి చెప్పారు.
టెక్నాలజీ, ఆవిష్కరణ (Technology and innovation)
మూడో శక్తిగా టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను ప్రధాని ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ, అంతరిక్ష రంగం, రోబోటిక్స్, డేటా సెంటర్లు వంటి భవిష్యత్ రంగాల్లో భారత్ మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా దేశం నాయకత్వం వహించాలని చెప్పారు. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా 6జీను ప్రపంచానికి అందించే స్థాయికి భారత్ ఎదగడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
గతి శక్తి (Gati Shakti)
నాలుగో శక్తిగా గతిశక్తిని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో రవాణా, కనెక్టివిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. హైస్పీడ్ రైళ్లు, కొత్త పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు వంటి మౌలిక వసతులను విస్తరించడంతో పాటు.. దేశంలోని నగరాలు, పరిశ్రమలు, పోర్టులు పరస్పరం మెరుగ్గా అనుసంధానమయ్యేలా చూడాలని సూచించారు. పోర్టులను కేవలం సరుకులు ఎగుమతి, దిగుమతి చేసే ప్రాంతాలుగా కాకుండా.. ఆర్థిక అభివృద్ధికి కేంద్రాలుగా మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రక్షణ శక్తి (Raksha Shakti)
ఐదో శక్తిగా రక్షణ రంగం గురించి పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్ మరింత ఆత్మనిర్భర్‌గా మారాలని ప్రధాని చెప్పారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, హైపర్‌సోనిక్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో భారత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. భారత్ కేవలం ప్రపంచ దేశాలకు మార్కెట్‌గా ఉండకుండా.. అత్యాధునిక రక్షణ సాంకేతికతను తయారు చేసి ఇతర దేశాలకు అందించే స్థాయికి ఎదగాలన్నది లక్ష్యం.
గ్రీన్, బ్లూ ఎకానమీ (Green economy and blue economy)
ఆరవ శక్తిగా గ్రీన్, బ్లూ ఎకానమీలను ప్రధాని ప్రస్తావించారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, పర్యావరణహిత తయారీ వంటి రంగాల్లో భారత్ భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.
అదే సమయంలో.. దేశానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని కూడా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. మత్స్య పరిశ్రమ, సముద్ర సాంకేతికత, తీర ప్రాంత పర్యాటకం వంటి రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా బ్లూ ఎకానమీకి మరింత ఊతమివ్వాలని అన్నారు.
యువశక్తి, సాఫ్ట్ పవర్ (India’s soft power)
'సప్తధార'లో చివరి శక్తిగా యువశక్తి, భారత సాఫ్ట్ పవర్‌ను ప్రధాని వివరించారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, హస్తకళలు వంటి సంప్రదాయ రంగాలతో పాటు సినిమాలు, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ వంటి ఆధునిక సృజనాత్మక రంగాల్లో కూడా భారత్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకోవాలని అన్నారు.
అంతే కాకుండా.. వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం, భారతదేశంలోని ప్రకృతి అందాలు, జాతీయ పార్కులు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయడం ద్వారా దేశ సాఫ్ట్ పవర్‌ను పెంచుకోవాలని సూచించారు.
'సప్తధార'లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడు రంగాలను వేర్వేరుగా చూడకూడదని ప్రధాని స్పష్టం చేయడం. ఉదాహరణకు తయారీ రంగానికి టెక్నాలజీ అవసరం. వ్యవసాయానికి ఫుడ్ ప్రాసెసింగ్ అవసరం. ఎగుమతులకు మెరుగైన లాజిస్టిక్స్ అవసరం. రక్షణ రంగానికి ఆవిష్కరణలు అవసరం. గ్రీన్ ఎకానమీకి యువత, టెక్నాలజీ అవసరం. అంటే.. ఒక రంగం అభివృద్ధి చెందితే దాని ప్రభావం మరో రంగంపైనా పడుతుంది. ఈ రంగాలన్నింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడమే 'సప్తధార' ఆలోచనలోని అసలు ఉద్దేశం.
వికసిత్ భారత్ లక్ష్యానికి.. సప్తధార!
మన దేశం స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం ఒకటి రెండు రంగాలు అభివృద్ధి చెందితే సరిపోదు. తయారీ నుంచి వ్యవసాయం వరకు, టెక్నాలజీ నుంచి రక్షణ వరకు, గ్రీన్ ఎకానమీ నుంచి యువశక్తి వరకు అన్ని రంగాలు కలిసి ముందుకు సాగాలి.
ఇదీ చదవండి: 80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం!


