డిజిటల్ విప్లవానికి కీలకమైన డేటా సెంటర్లు భారీగా నీటిని వృథా చేస్తున్నాయనే నిరసనలు, ఆందోళనల వెనుక ఉన్న అసలు నిజాలను శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ఇటీవల ఒక మెట్రో నగరంలో హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు శుద్ధి చేసిన మురుగునీటిని (ట్రీటెడ్ సీవేజ్ వాటర్) కిలోలీటర్‌కు రూ.7.50 చొప్పున కేటాయిస్తే.. నగర వాసుల తాగునీటి అక్రమరవాణా అంటూ తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
మురుగునీరు.. రాబడికి మార్గం
సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ తోంగ్ 2002లోనే శుద్ధి చేసిన మురుగునీటిని తాగి, అది తాగేందుకు పూర్తిగా సురక్షితమని నిరూపించారు. నిజానికి డేటా సెంటర్లు, సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు పౌరులు తాగే నీటికంటే అత్యంత ప్రాసెస్ చేసిన నీరు అవసరం. భారత్‌లో రోజుకు సుమారు 72,368 మిలియన్ లీటర్ల(ఎంఎల్‌డీ) మురుగునీరు ఉత్పత్తవుతుండగా కేవలం 20,000 ఎంఎల్‌డీ మాత్రమే శుద్ధి అవుతోంది. మిగిలినదంతా సముద్రాలు, నదుల్లో కలసి వృథాగా పోతోంది. ఇటువంటి సమయంలో మురుగునీటిని శుద్ధి చేసి డేటా సెంటర్లకు విక్రయించడం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లకు భారీగా ఆదాయం సమకూరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.
అసలు నీటి వినియోగం ఎంత?
‘నేషన్ ఫస్ట్ పాలసీ రీసెర్చ్ అండ్ చేంజ్ ఫౌండేషన్’ (మే 2026 నివేదిక - బియాండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ప్రకారం భారతదేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 2024లోని 1,352 మెగావాట్ల నుంచి 2030 నాటికి 8,318 మెగావాట్లకి చేరనుంది. అప్పటివరకు కావలసింది ఏడాదికి 163 బిలియన్ లీటర్లు మాత్రమే. భారత్ ఏడాదికి వాడుతున్న 7 లక్షల బిలియన్ లీటర్ల నీటితో పోలిస్తే ఇందులో 4/5 వంతు వ్యవసాయానికే వెళ్తోంది. డేటా సెంటర్ల నీటి అవసరం అందులో 1/50వ వంతు మాత్రమే. కేంద్ర భూగర్భ జలాల బోర్డు ప్రకారం పంజాబ్‌లో పునరుద్ధరణ కంటే 160 శాతం ఎక్కువ నీటిని ఉచిత విద్యుత్‌తో వరి సాగుకు తోడుతున్నా పెద్దగా నిరసనలు ఉండవు, కానీ మురుగునీటిని కొనుగోలు చేసే డేటా సెంటర్లపై విమర్శలు రావడం విడ్డూరమని నిపుణులు చెబుతున్నారు.
పరిష్కార మార్గాలు
డేటా సెంటర్లను నిషేధించడం పరిష్కారం కాదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డేటా సెంటర్లకు వ్యర్థ జలాల సరఫరాను అడ్డుకుంటే అవి పొడి శీతలీకరణ (Dry chillers విద్యుత్‌తో చల్లబరచడం) వైపు మొగ్గుచూపి 10-65% అదనపు విద్యుత్ అవసరమౌతుంది. తద్వారా విద్యుత్ ఉత్పాదనలో నీటి వాడకం పెరుగుతుంది.
గుజరాత్ (2018) పునర్వినియోగ విధానం, జాతీయ చట్రం (2022)ల తరహాలోనే డేటా సెంటర్లు, థర్మల్ పవర్, టెక్స్‌టైల్స్, నిర్మాణ రంగాలకు శుద్ధి చేసిన మురుగునీటి వినియోగాన్ని నిబంధనగా మార్చాలని కొందరు కోరుతున్నారు. డేటా సెంటర్ల అనుమతుల సమయంలోనే నీటి వినియోగ వివరాలను సేకరించి పారదర్శకంగా ఉంచాలి. తాగునీటి కంటే శుద్ధి చేసిన వ్యర్థ జలాల ధరను తక్కువగా నిర్ణయించి వృథాను అరికట్టాలి. సరైన శాస్త్రీయ ఆధారాలు, ధనిక ప్రాతిపదికన ధరల నిర్ణయం ఉంటేనే ప్రజాభిప్రాయాన్ని సరైన దిశలో నడిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే..


