డేటా సెంటర్ కోసం కొండల్ని ఛిద్రం చేస్తున్న చంద్రబాబు సర్కారు
విశాఖ నగర జలజీవనాడులు తర్లువాడ కొండలు
తూర్పు కనుమల నుంచి వర్షపు నీటిని గంభీరం గెడ్డకు అందించే జలసిరి
పర్యావరణ అనుమతులు రాకుండానే ధ్వంసం చేసిన ప్రభుత్వం
చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారంటూ పర్యావరణవేత్తల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం నగర దాహార్తిని తీర్చే ప్రధాన సహజ జలవనరుల్లో ఒకటైన తర్లువాడ కొండలు నేడు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అభివృద్ధి పేరుతో డేటా సెంటర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా, చట్టాలను పక్కనపెట్టి మరీ కొండలను పిండిచేస్తూ సహజ జలమార్గాలను ధ్వంసం చేయడం పర్యావరణవేత్తలను, స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాంకేతిక పురోగతి అవసరమే అయినప్పటికీ.. భవిష్యత్ తరాల తాగునీటి మూలాలను బలిపీఠంపై ఎక్కించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని తర్లువాడ కొండలు కేవలం రాతిగుట్టలు మాత్రమే కాదు. ఇవి తూర్పు కనుమల శ్రేణిలో భాగమైన ఈ కొండలు దశాబ్దాలుగా విశాఖ నగరానికి, భీమిలి, మధురవాడ పరిసర ప్రాంతాలకు సహజ జలసేకరణ వ్యవస్థలుగా పనిచేస్తున్నాయి. 1954 నుంచి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తున్న గంభీరం గెడ్డ రిజర్వాయర్‌కు ప్రాణం పోసేది ఈ కొండలే. వర్షాకాలంలో తూర్పు కనుమలపై కురిసే ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి, కోట్లాది లీటర్ల నీటిని గంభీరం రిజర్వాయర్‌కు చేరవేసే ప్రకృతి ప్రసాదించిన జలరక్షణ కవచాలు.. ఛిద్రమైపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలి కాలంలో డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతాన్ని కేటాయించడంతో పరిస్థితి దారుణంగా మారింది.

నీటికి కటకటే
ఇస్రోకి చెందిన ‘భువన్’ శాటిలైట్ మ్యాపింగ్ యాప్‌లో ఓసారి పరిశీలిస్తే.. తర్లువాడ కొండలపై నుంచి గంభీరం గెడ్డ వైపు నీలిగీతలు (సహజ జలధారలు) స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ సహజ జలప్రవాహ మార్గాలను.. డేటా సెంటర్ పనుల కారణంగా భారీగా తవ్వకాలు జరిపి మట్టితో కప్పేస్తున్నారు. ఈ సహజ జలమార్గాలను మూసేస్తే గంభీరం రిజర్వాయర్‌కు నీరుచేరే మార్గాలు శాశ్వతంగా మాయమైపోనున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో విశాఖ నగర తాగునీటి సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు, పర్యావరణశాఖ అధికారులు ఈ విధ్వంసాన్ని గమనించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
140 ఎకరాల కొండల్లో విధ్వంసం
పచ్చని అటవీ సంపదతో, వర్షాధార వృక్షాలతో కళకళలాడే తర్లువాడ కొండల్లో దాదాపు 140 ఎకరాల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతాన్ని చట్టబద్ధమైన పర్యావరణ అనుమతులు లేకుండానే ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండలను చదును చేసేందుకు చేపట్టిన భారీ తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటోంది. పనుల తీరు పరిశీలించేందుకు ఎవరు వెళ్తున్నా.. వారిని నిలువరించి అరెస్టు చేసేందుకు సైతం చంద్రబాబు ప్రభుత్వం వెనకాడటం లేదు.
విశాఖ ప్రజలు పోరాడాల్సిన సమయం
ఈ తర్లువాడ కొండల విధ్వంసంపై జనసేన మాజీ నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సున్నిత ప్రాంతాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని టీఎన్ గోదావర్మన్ తిరుముల్పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన తీర్పు ఇచి్చందని చెప్పారు. ఎలాంటి ప్రాజెక్టుకైనా పర్యావరణ అనుమతి లేకుండా పనులు ప్రారంభించడం చట్టవిరుద్ధమన్నారు. పోస్ట్–ఫ్యాక్టో విధానంలో పనులు పూర్తిచేసిన తర్వాత అనుమతులు తెచ్చుకోవచ్చనే విధానాన్ని న్యాయస్థానం ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించదని పేర్కొన్నారు.
పర్యావరణ ప్రభావ అంచనా నిర్వహించకుండా కొండలను తొలగించడం, సహజ జలవనరులను పూడ్చేయడం శిక్షార్హమైన నేరమని చెప్పారు. ప్రకృతి వనరులు.. పాలకులు లేదా రాజకీయ శక్తుల సొంత ఆస్తి కాదన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా పోరాడుతున్నారని చెప్పారు. అదే స్థాయి ప్రజా చైతన్యం, పర్యావరణ స్పృహ విశాఖ ప్రజల్లోను రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.


