డాబాగార్డెన్స్: ఏఐ డేటా సెంటర్ల వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను బహిరంగ ప్రజా చర్చ, సమగ్ర అధ్యయనం అనంతరమే చేపట్టాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ అవసరమే అయినప్పటికీ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలతో సమతుల్యత పాటించాలని సూచించారు. విశాఖలో ప్రతిపాదిత ఏఐ డేటా సెంటర్లకు సంబంధించిన చట్టపర, పర్యావరణ, ప్రజా విధాన అంశాలపై ఆదివారం డాబాగార్డెన్స్‌లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రీన్ విశాఖ కమిటీ అధ్యక్షుడు కె.రాజారామ్మోహన్‌రాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రభావం, చట్టపర అంశాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో గ్రీన్ విశాఖ కమిటీ కార్యదర్శి డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, ఎన్.వెంకటేశ్వరరావు, పి.సత్యనారాయణ, కేవై మణి, డీవీ అనీల్‌కుమార్, ఎ.సుధాకర్, బి.అప్పలరెడ్డి, కె.హరిత, జి.అనూషకుమారి, హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రతినిధి వీఎస్ కృష్ణ, పౌర చైతన్య వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ కేకేకే చంద్, కార్యదర్శి సీహెచ్ ప్రమీలా, ప్రొఫెసర్ బైరాగిరెడ్డి, గ్రీన్ విశాఖ బృంద సభ్యులు జి.కాంతారావు, సాయి ఫణీంద్ర, తిరుపతిరావు, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధికార ప్రతినిధి, న్యాయవాది పాకా సత్యనారాయణ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.


