వైఎస్సార్‌సీపీ హయాంలో బీచ్ ఐటీ ప్రమోషన్‌తో క్యూ కట్టిన కంపెనీలు
ఎమర్జింగ్ ఐటీ హబ్‌గా విశాఖకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన లింక్డ్‌ఇన్
అయితే మౌలిక వసతుల కల్పన ఘోరంగా ఉందని తేల్చిన సర్వే
మాటలు తప్ప.. ఆచరణలో చూపించని చంద్రబాబు ప్రభుత్వం
సూరత్‌తో పోలిస్తే మెట్రో, బీచ్ కారిడార్లలో బాగా వెనకబడ్డారన్న లింక్డ్‌ఇన్
సాక్షి, విశాఖపట్నం: ఐటీ ఉద్యోగాల సృష్టిలో దూసుకుపోతున్న విశాఖకు మౌలిక వసతుల లేమి శాపంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పకడ్బందీ ప్రణాళికలతో పునాదులు పటిష్టంగా మారిన విశాఖ ఐటీ రంగానికి.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేక నీరుగారుస్తోంది. తాజాగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ విడుదల చేసిన సర్వే నివేదిక కూటమి సర్కారు నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. ఆ సర్వేలో విశాఖ ఐటీ ప్రగతిని కీర్తిస్తూనే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో విశాఖ అగ్రస్థానంలో ఉందని చెబుతూనే.. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం దారుణంగా వెనుకబడి ఉందనే కఠోర వాస్తవాన్ని ఈ సర్వే బహిర్గతం చేసింది.
బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో బూస్ట్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగానికి విశేష ప్రాధాన్యత దక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా.. ‘బీచ్ ఐటీ’ కాన్సెప్ట్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రమోట్ చేయడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి కల్పించే స్టార్టప్‌లకు, బహుళజాతి సంస్థలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు విశాఖలో పాగా వేసిన తర్వాత.. వరుసగా ఐటీ సంస్థలు క్యూ కట్టాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. నిరంతర పర్యవేక్షణ, కృషితోనే నేడు విశాఖపట్నం దేశంలోనే టైర్–2 నగరాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘టాప్ ఎమర్జింగ్ ఐటీ హబ్’గా లింక్డ్‌ఇన్ నివేదికలో ఫస్ట్ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే, నివేదిక ఎత్తిచూపిన మరో కోణం ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ డొల్లతనాన్ని, పాలకుల చిత్తశుద్ధి లేమిని నిలదీస్తోంది.
మౌలిక వసతులు ఘోరం.!
ఐటీ రంగం ఉరుకులు పరుగులు పెడుతున్నా, ఆ అద్భుతమైన వృద్ధికి తగ్గట్లుగా నగరంలో ఆధునిక మౌలిక వసతుల కల్పన మాత్రం అత్యంత ఘోరంగా ఉందని నివేదిక తేల్చిచెప్పింది. రెండేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం కేవలం అద్భుతమైన గ్రాఫిక్స్.. ఉదయం లేస్తే చెప్పే ప్రగల్భాలకే పరిమితమైందనీ.. క్షేత్రస్థాయిలో ఆచరణలో శూన్యమన్న విమర్శలకు ఈ సర్వే నిలువుటద్దంలా నిలిచింది. గుజరాత్‌లోని సూరత్ నగరంతో విశాఖను పోల్చిన లింక్డ్‌ఇన్ నివేదిక.. పట్టణ మౌలిక సదుపాయాల్లో విశాఖ ఎంత వెనుకబడి ఉందో.. స్పష్టంగా వివరించింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు, నగర ప్రజలకు అత్యంత అవసరమైన ‘మెట్రో రైలు’ ప్రాజెక్టు, అలాగే పర్యాటకానికి ప్రాణం పోసేలా.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాచబాటగా మారే ప్రతిష్టాత్మక ‘బీచ్ కారిడార్’ నిర్మాణాల్లో సూరత్‌తో పోలిస్తే విశాఖ బాగా వెనుకబడి ఉందని రిపోర్ట్ కుండబద్దలు కొట్టింది. సూరత్ లాంటి నగరాలు ఫ్లైఓవర్లు, ఆధునిక వసతులతో దూసుకుపోతుంటే, విశాఖలో మాత్రం ఆ ఊసే లేదు.
మాటలు కాదు.. ఐటీ అవసరాలు తీర్చండి!
పెరుగుతున్న జనాభా, ఐటీ నిపుణుల అవసరాలను తీర్చేలా ప్రజా రవాణా మెరుగుపరచడం, ఆధునిక రోడ్ల విస్తరణ వంటివి చేపట్టడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందన్నది కాదనలేని సత్యం. కేవలం గత ప్రభుత్వం తెచ్చిన కంపెనీల ఖాతాలో పడుతూ పబ్బం గడుపుకోవడం తప్ప, ఈ ప్రభుత్వం కొత్తగా సాధించిన, చేపట్టిన మౌలికాభివృద్ధి ఏమీ లేదన్నది సర్వేలో వెల్లడైన నిజాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికై నా మాటలు కట్టిపెట్టి.. యుద్ధప్రాతిపదికన మెట్రో, బీచ్‌కారిడార్ వంటి ఆధునిక మౌలిక వసతుల ప్రాజెక్టులను పట్టాలెక్కించకపోతే.. భవిష్యత్తులో ఐటీ రంగంలో విశాఖ తీవ్ర కుంగుబాటును చవిచూడక తప్పదని నిపుణులు తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేని నగరానికి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు రావడం కలగానే మిగిలిపోతుందన్న వాస్తవాన్ని పాలకులు ఇప్పటికై నా గుర్తించాలని సర్వే హెచ్చరిస్తోంది.


