రూ.299 కోట్లతో అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు
అనుబంధంగా.. రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్‌లు 14కు పెంపు
ఇవి అందుబాటులోకి వస్తే అవుటర్‌లో రైళ్లు వెయిటింగ్‌కు స్వస్తి
సర్ఫేస్ క్రాసింగ్ సమస్యకు పరిష్కారం
ప్రాజెక్టు పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దక్షిణ కోస్తా జోన్ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో జోన్ పరిధిలో అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోయేలా అభివృద్ధి పనులు చేపడుతుండగా, మరోవైపు అవుటర్‌లో వెయిటింగ్ సమస్యకు చెక్ పెట్టే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రైల్వే మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న రైల్వే కోచింగ్ యార్డు ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రూ.299 కోట్లతో 2028 డిసెంబర్ నాటికి రీమోడలింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు, ప్రస్తుతం రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను 8 నుంచి 14కు పెంచనున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే నిరీక్షణకు తెరపడి, స్టేషన్‌కు రైలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడి, ప్రయాణికుల సమస్యలకు ఫుల్‌స్టాప్ పడనుంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విశాఖపట్నం స్టేషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు, రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని విశాఖపట్నం కోచింగ్ యార్డు పునర్నిర్మాణ ప్రాజెక్టుకు రూ.299 కోట్లను మంజూరు చేస్తూ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా స్టేషన్ మౌలిక సదుపాయాలు ఆధునికీకరించడమే కాకుండా, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
అవుటర్‌లో నిరీక్షణ ఉండదు
ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు సగటున 113 రైళ్లు ప్రయాణిస్తుండగా, ప్రతిరోజూ దాదాపు 80,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న యార్డు కారణంగా స్టేషన్‌లోకి వచ్చే, వెళ్లే రైళ్లు ‘సర్ఫేస్ క్రాసింగ్’ అంటే ఒకే ట్రాక్‌పై ఇతర రైళ్ల రాకపోకల అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనివల్ల రైళ్లు స్టేషన్ బయట సిగ్నల్స్ వద్ద నిమిషాల తరబడి ఆగిపోవడం, ప్లాట్‌ఫామ్‌లు ఖాళీ లేకపోవడం వంటి తీవ్రమైన నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రీమోడలింగ్ ప్రాజెక్టుతో సర్ఫేస్ క్రాసింగ్ సమస్య తీరనుంది. రైళ్ల నిలిపివేత సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, రైళ్ల సమయపాలన మెరుగుపడటంతో పాటు మరిన్ని కొత్త రైళ్లను నడిపేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
యార్డు పూర్తయితే.. కొత్తరైళ్లకు అవకాశం.!
కోచింగ్ యార్డు రీమోడలింగ్ పూర్తయితే విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని కొత్త ఎక్స్‌ప్రెస్, వందే భారత్ రైళ్లను ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖ రైల్వే స్టేషన్ ఒక ప్రధాన రవాణా కేంద్రంగా రూపాంతరం చెందనుంది. ఫలితంగా నగర ప్రయాణికులకు, పర్యాటకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభూతిని అందిస్తుందని దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులో కీలకమైనవివే..
ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్‌ఫారమ్‌లను వెడల్పు చేయడంతో పాటు, అన్ని ఆధునిక సౌకర్యాలతో మరో 6 కొత్త ప్లాట్‌ఫామ్‌లను నిర్మించనున్నారు. అలాగే రైళ్ల రాకపోకల కోసం అదనంగా మరో 6 రైల్వే ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు.
ప్రాజెక్టు పరిధిలోని పాత లూప్ లైన్లను తొలగించి, పాయింట్ జోన్లను శాసీ్త్రయంగా పునర్వ్యవస్థీకరిస్తారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే స్టేషన్ తూర్పు వైపున కొత్త ప్రవేశ ద్వారాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి అనుగుణంగా ప్రయాణికుల రిజర్వేషన్ కేంద్రాన్ని కూడా అక్కడికే తరలిస్తారు.
సిగ్నలింగ్ వ్యవస్థను అత్యంత సురక్షితంగా, వేగవంతంగా మార్చేందుకు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సాంకేతికతను కోచింగ్ యార్డులో ఏర్పాటు చేయనున్నారు.
వెడల్పు చేసిన ప్లాట్‌ఫామ్‌లపై ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేందుకు లిఫ్టు లు, ఎస్కలేటర్లు, ర్యాంప్‌లు నిర్మిస్తారు. ప్రయాణికుల వాహనాల కోసం విశాలమైన సర్ఫేస్ పార్కింగ్‌తో పాటు, స్టేషన్ బయట ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సక్రమమైన సర్క్యులేటింగ్ ఏరియా ప్లాన్‌ను అమలు చేయనున్నారు.
విశాఖలో రైల్వే కోచింగ్ యార్డ్ రీ మోడలింగ్‌కు బోర్డు ఆమోదం


