భారతీయ వ్యవసాయ రంగంలో రైతు కేవలం ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, ఒక ‘వ్యవసాయ పారిశ్రామికవేత్త’గా మారినప్పుడే నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుంది. సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు పండించడంతో పాటు శాస్త్రీయ ఆర్థిక నిర్వహణ, పంటల వైవిధ్యం, ప్రభుత్వ పథకాల సద్వినియోగం ద్వారా మాత్రమే వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మలచవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రైతుల కోసం కొన్ని ప్రభుత్వ ఆర్థిక పథకాలు
రైతులు తమ పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవడానికి, భద్రత పొందడానికి కింది పథకాలను వినియోగించుకోవాలి.
పీఎం-కిసాన్: భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6,000 మూడు విడతల్లో పెట్టుబడి సహాయంగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. (రాష్ట్ర ప్రభుత్వాల ప్లాన్‌ల ద్వారా అదనపు సాయం అందుబాటులో ఉంటుంది).
కిసాన్ క్రెడిట్ కార్డ్: బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే (నగదు రహిత సబ్సిడీతో కలిపి 4 శాతానికే) పంట రుణాలు పొందే వెసులుబాటు.
ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన: ప్రకృతి వైపరీత్యాలు, పురుగుల తాకిడి వల్ల పంట నష్టం వాటిల్లినప్పుడు కనీస ప్రీమియం (ఖరీఫ్ 2%, రబీ 1.5%) చెల్లించి పూర్తి ఆర్థిక రక్షణ పొందవచ్చు.
పీఎం కుసుమ్: సోలార్ పంప్‌సెట్ల ఏర్పాటుకు 60 శాతం వరకు సబ్సిడీ పొందడం ద్వారా విద్యుత్తు ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవచ్చు.
రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సూత్రాలు
పంటల డిజిటల్ బుక్
వ్యవసాయం నష్టపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎక్కడ దారి మళ్లుతుందో లెక్క లేకపోవడం. సాధారణ డైరీ రాయడం కంటే ఫార్మ్‌చేంజ్, అగ్రీకాంబస్ లేదా ఉచిత ఖాతాబుక్/డిజిటల్ రిజిస్టర్ యాప్‌లను ఉపయోగించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్ డీజిల్, రోజువారీ కూలీల ఖర్చులను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలి.
పంట చివరిలో ఏ రసాయనం, ఏ పని వల్ల ఎంత లాభం వచ్చిందో స్పష్టత వస్తుంది. అనవసర పురుగుమందుల ఖర్చులను 20-30% వరకు తగ్గించుకోవచ్చు.
వ్యవసాయ అత్యవసర నిధి
వాతావరణ మార్పులు, అకాల వర్షాలు లేదా ధరల పతనం వంటి ఆకస్మిక నష్టాల నుంచి రైతును కాపాడే రక్షణ కవచం ఇది. ప్రతి పంట అమ్మకం ద్వారా వచ్చే నికర ఆదాయంలో కనీసం 10-15% నిధిని వేరు చేయాలి. ఈ డబ్బును ఇంట్లో ఉంచకుండా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్యాంకులో ‘స్వీప్-ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్’ రూపంలో పెట్టాలి. దీనివల్ల సాధారణ సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ వడ్డీ రావడమే కాకుండా అత్యవసర సమయంలో వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. పంట నష్టపోయినప్పుడు మళ్లీ విత్తనాలు/ఎరువుల కొనుగోలు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద 24-36% ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు.
రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీఓ)
ఒంటరిగా పోరాడే రైతు కంటే 100 మంది రైతులు ఒక సమూహంగా ఏర్పడితే మార్కెట్‌లో బేరమాడే శక్తి పెరుగుతుంది. ఎఫ్‌పీఓ ద్వారా విత్తనాలు, ఎరువులు, యంత్రాలను హోల్‌సేల్ ధరలకు నేరుగా కంపెనీల నుంచే కొనుగోలు చేయడం వల్ల ఇన్‌పుట్ ఖర్చులు 15-20% తగ్గుతాయి. పంటను నేరుగా కమీషన్ దారులకు అమ్మకుండా ఎఫ్‌పీఓ ద్వారా గ్రేడింగ్, ప్రాసెసింగ్ (ఉదాహరణకు: కందిపప్పుగా మార్చడం, నూనె తీయడం), ప్యాకింగ్ చేసి రిటైల్ మార్కెట్‌కు లేదా సూపర్ మార్కెట్లకు అమ్మాలి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లైన ‘ఈ-నామ్’ ద్వారా దేశంలో ఎక్కడ మంచి ధర ఉంటే అక్కడ అమ్ముకునే వీలుంటుంది.
సమగ్ర బీమా రక్షణ
తీవ్రమైన అనారోగ్యం లేదా ఊహించని పంట నష్టం మొత్తం కుటుంబ ఆర్థిక పరిస్థితులను మార్చేస్తుంది. కాబట్టి మెరుగైన బీమా రక్షణ అత్యవసరం.
పంట బీమా.. వాతావరణ ఆధారిత పంట బీమాను కేవలం రుణం తీసుకునేటప్పుడే కాకుండా ప్రతి సీజన్ గడువు ముగిసేలోగా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలి. స్థానిక వ్యవసాయ అధికారి ద్వారా నష్ట పరిహార నమోదు విధానంపై స్పష్టత ఉండాలి.
ఆరోగ్య బీమా.. ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్ లేదా ఆరోగ్యశ్రీ కార్డులు ప్రతి రైతు కుటుంబానికి తప్పనిసరి. ఇవి కాకుండా రూ.3,000-రూ.5,000 ప్రీమియంతో అదనపు కుటుంబ ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల ఆసుపత్రి ఖర్చుల కోసం పొలం అమ్మాల్సిన పరిస్థితి రాదు.
వ్యక్తిగత ప్రమాద బీమా.. పీఎం సురక్ష బీమా యోజన ద్వారా కేవలం రూ.20లకే లభించే ప్రమాద బీమాను ప్రతి రైతు పొంది ఉండాలి.
ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు..


