సాగునీరు ఇచ్చే సన్నద్ధత లేదా? | Krishna Delta Irrigation Water Crisis: AP Government's Failure and Farmers' Plight | Sakshi
Sakshi News home page

సాగునీరు ఇచ్చే సన్నద్ధత లేదా?

Aug 14 2026 2:14 PM | Updated on Aug 14 2026 2:26 PM

Krishna Delta Irrigation Water Crisis Andhra Pradesh Farmers

అభిప్రాయం

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో నీటి నిల్వలు పడి పోయాయనీ, అందువల్ల కృష్ణా డెల్లాకు సాగునీరు ఇవ్వలేమనీ జూలై 24న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రకటించింది. వరి పంట వేయ వద్దనీ, వరి పంట వేస్తే తర్వాత నీరు లేక నష్టపోయేది రైతులేననీ హెచ్చరిక జారీ చేశారు మంత్రిపుంగవులు. ఎల్‌ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాభావంతో పాటు కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఖరీఫ్‌కు చాలాముందే ప్రకటించారు. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కాని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదు.

జూన్‌– జూలై నెలల మధ్య సాగు నీరు విడుదల విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. జూన్‌ నెలలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు నీరు విడుదల తేదీలను కూటమి మంత్రులు ప్రకటించారు. మంత్రుల ప్రకటనతో అప్పులు చేసి సేద్యానికి కావాల్సిన వనరులను రైతులు సమకూర్చుకున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో ఎల్‌ నినో ప్రభావం వల్ల ఇప్పుడు సాగు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం వల్ల రైతాంగం తీవ్రమైన మనోవేదనకు గురౌతున్నారు.

జల వనరుల వ్యవస్థ తాజా గణాంకాల ప్రకారం ప్రకాశం బ్యారేజి నీటి నిల్వ 2.978 టీఎమ్‌సీలు కాగా, పూర్తి నీటి మట్టం 3.071 టీఎమ్‌సీలు. 96.97% నీటి నిల్వ ఉన్నందువల్ల సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని నిపుణులు చెబుతున్నారు. పులిచింతలలో ప్రస్తుతం 29.039 టీఎమ్‌సీల నీరు ఉంది. మరి కూటమి ప్రభుత్వం సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదు?

కృష్ణా డెల్టాలో ప్రధాన సేద్యం వరి. అలాంటి వరి సేద్యం చేయవద్దంటే, రైతులు ఖరీఫ్‌ సేద్యానికి దూరం కావడమే కదా! ప్రకాశం బ్యారేజి కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు విడుదల చేయకపోతే ఆ పంటల సేద్యం సాధ్యం కాదు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుని, పూడికలు తీసి నీటితో వాటిని నింపి ఉంటే, వాటి ద్వారా నీరు లభించేది. ఇది పాలకుల వైఫల్యం కాదా?

రాష్ట్రంలోని 608 మండలాల్లో 250 మండలాలు తీవ్ర కరువు మండలాలుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో కరవును ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కరవు మండలాల్లో గ్రామీణ ఉపాధి హామీ పనులను 250 రోజులకు పెంచి గ్రామీణ పేద కుటుంబాలకు పనులు కల్పించాలి. ఆ పనుల వేతనం పెంచాలి. రైతాంగానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా ఇవ్వాలి. వారు తీసుకున్న పంట రుణాలు రద్దు చేయాలి. తాగు నీటి సమస్య లేకుండా చూడాలి. ఈ డిమాండ్ల సాధన కోసం రైతాంగం, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి.
- బొల్లిముంత సాంబశివరావు, వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్‌), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement