బిడ్డ కోసం తల్లి పోరాటం.. గెలిచిన పేగు బంధం! | 23-Month-Old Child Reunited With Mother After High Court Battle In Visakhapatnam | Sakshi
Sakshi News home page

బిడ్డ కోసం తల్లి పోరాటం.. గెలిచిన పేగు బంధం!

Aug 14 2026 1:33 PM | Updated on Aug 14 2026 1:36 PM

23-Month-Old Child Reunited With Mother After High Court Battle In Visakhapatnam

కవల పాపాయి కోసం తల్లడిల్లిన తల్లి హృదయం

23 నెలల కన్నబిడ్డ కోసం పోరాటం

హైకోర్టు జోక్యంతో మళ్లీ అమ్మ ఒడికి చేరిన బుజ్జాయి

విశాఖ పోలీసుల తీరుపై బాధితురాలు, మహిళా నేతల ఆగ్రహం

కేసారి ఇద్దరు పసికందుల చిరునవ్వులను ముద్దాడే ఆ తల్లి ప్రపంచంలో ఒక్కసారిగా చీకట్లు ముసిరాయి. తన రెండు కళ్లలాంటి కవల బిడ్డల్లో ఒక చిన్నారిని భర్త బలవంతంగా లాక్కెళ్తుంటే.. ఆ తల్లి గుండె పగిలిపోయింది. 23 నెలల పసికందు అమ్మ పాలు లేక, కన్నతల్లి స్పర్శకు దూరమై అలమటించిపోతుంటే.. ఆ తల్లి నిద్రలేని రాత్రుళ్లతో నరకం అనుభవించింది. కన్నబిడ్డకు దూరమైతే తల్లి మనసు ఎంతగా తల్లడిల్లిపోతుందో.. పేగు బంధం కోసం ఆమె ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుందో నిరూపించే హృదయవిదారక ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది. ఆ తల్లి చేసిన న్యాయపోరాటం, పోలీసుల నిర్లక్ష్యంపై బాధిత వైద్యురాలు, పీవోడబ్ల్యూ నేతలు మీడియాతో వెల్లడించిన వివరాల ప్రకారం..

సీతంపేట ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసముంటున్న డాక్టర్‌ దండి గాయత్రి, భర్త వెంకట సిద్ధార్థకు కవల పిల్లలు. భర్త అత్తింటి వేధింపులు తాళలేక గాయత్రి ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసి, భర్త నుంచి వేరుగా తన ఇద్దరు పసిపాపలతో తన తల్లి రాజ్యలక్ష్మి ఇంట్లో ఉంటున్నారు. ఈ తరుణంలో భర్త వెంకట సిద్ధార్థ, గాయత్రి ఇంటికి వెళ్లి ఆమెపై దాడికి తెగబడి బలవంతంగా ఒక పాపను ఎత్తుకెళ్లాడు.

కనికరించని ఖాకీలు..!
‘నా బిడ్డను నాకు తెచ్చివ్వండి’ అని కన్నీరుమున్నీరుగా పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కిన ఆ తల్లికి ఖాకీల నుంచి నిరాశే ఎదురైంది. ‘ఏమైనా ఉంటే కోర్టులోనే చూసుకోండి’ అని చెప్పడంతో ఆ తల్లి మరింత కుంగిపోయింది. కానీ, పసికందు ఆకలి కేకలు ఆ తల్లిలోని పోరాట పటిమను నిద్రలేపాయి. పీవోడబ్ల్యూ నేత లక్ష్మి, న్యాయవాది గంగాభవాని ఇచ్చిన ధైర్యంతో ఆ కన్నతల్లి న్యాయస్థానం తలుపు తట్టింది.

హైకోర్టు మెట్లెక్కి..
హైకోర్టులో దాఖలైన హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆ తల్లి వేదనను, పసిపాప భవిష్యత్తును పరిశీలించిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఏకంగా రాష్ట్ర డీజీపీనే కోర్టుకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిద్రమత్తులో ఉన్న పోలీస్‌ యంత్రాంగం ఒక్కసారిగా పరుగులు తీసింది. చివరకు హైకోర్టు సమక్షంలోనే భర్త వెంకట సిద్ధార్థ ద్వారా ఆ 23 నెలల చిన్నారిని ఈ నెల 12న తల్లి గాయత్రికి అప్పగించారు. కన్నబిడ్డ కోసం ఆ కన్నతల్లి చేసిన అమూల్యమైన పోరాటం ముందర ఏ శక్తులూ నిలబడలేవని రుజువైంది. చివరకు ఆ తల్లి ప్రేమ, పేగు బంధమే గెలిచాయి.

పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం 
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆధ్వర్యంలో ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిని నేతలు తీవ్రంగా నిరసించారు. మైనార్టీ తీరే వరకు పిల్లలు తల్లి వద్దే ఉండాలని చట్టాలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ, పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని పీవోడబ్ల్యూ నేత లక్ష్మి మండిపడ్డారు. బాధితురాలు హైకోర్టు వరకు వెళ్లేలా చేయడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. తల్లి నుంచి బిడ్డను బలవంతంగా తీసుకువెళ్లడంలో పోలీసుల సహకారం కూడా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని న్యాయవాది గిరిధర్‌ ఆరోపించారు.

నా పోరాటానికి అండగా నిలిచారు – డాక్టర్‌ గాయత్రి
తన బిడ్డను తిరిగి దక్కించుకోవడానికి తాను సాగించిన ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో అండగా నిలిచిన పీవోడబ్ల్యూ బృందానికి, న్యాయవాదులకు డాక్టర్‌ గాయత్రి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పీవోడబ్ల్యూ నేతలు డి.రోహిణి, వెంకటలక్ష్మి, గాయత్రి తల్లి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొని ఆ తల్లి పోరాట పటిమను కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement