అంచనాలు అందుకోని ప్రభుత్వం | Andhra Pradesh White Paper 2026: Financial Crisis, Revenue Deficit and Salaries Analysis | Sakshi
Sakshi News home page

అంచనాలు అందుకోని ప్రభుత్వం

Aug 14 2026 2:08 PM | Updated on Aug 14 2026 2:25 PM

Andhra Pradesh Financial Crisis Revenue Deficit Salaries And Pensions

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రభుత్వం 2026 జూలైలో విడు దల చేసిన శ్వేతపత్రం కొత్త చర్చకు తెరతీసింది. 2024–25లో రాష్ట్ర స్వంత ఆదాయాలు రూ. 96,270 కోట్లు కాగా, జీతాలు, పెన్షన్లకు రూ. 92,869 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రాష్ట్ర సొంత ఆదాయానికి దాదాపు సమానమైన మొత్తం జీతాలు, పెన్షన్లకే వెళ్తున్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ‘రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే పోతోంది’ అనే వాదనను నేరుగా అంగీకరించడం సరైంది కాదు. రాష్ట్ర సొంత ఆదాయం, మొత్తం రెవెన్యూ ఆదాయం, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లు, అప్పులు... ఇవన్నీ వేర్వేరు. ఏ ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నాం అన్నదే శాతాన్ని నిర్ణయిస్తుంది.

2024–25లో రాష్ట్రానికి వాస్తవంగా వచ్చిన రెవెన్యూ రిసిప్షన్‌ రూ. 1,67,676 కోట్లు. ఇందులో రాష్ట్ర పన్ను ఆదాయం రూ. 89,435 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 5,972 కోట్లు కాగా, కేంద్ర పన్నుల వాటా రూ. 52,080 కోట్లు, కేంద్ర గ్రాంట్లు రూ. 20,188 కోట్లు. బడ్జెట్‌లో అంచనా వేసిన రూ. 2,01,174 కోట్లతో పోలిస్తే వాస్తవ రెవెన్యూ ఆదాయం రూ. 33,498 కోట్లు తక్కువగా వచ్చింది. రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలోనే రూ. 20,354 కోట్ల లోటు నమోదైంది. ఇదే రాష్ట్ర ఆర్థిక సమస్యకు కీలక సంకేతం. సమస్య కేవలం జీతాల భారం కాదు; ఆదాయాన్ని అంచనాల మేరకు సమకూర్చుకోలేకపోవడం.

2024–25లో రెవెన్యూ ఖర్చు రూ. 2,27,961 కోట్లు కాగా, రెవెన్యూ రాబడి రూ. 1,67,676 కోట్లు మాత్రమే. ఫలితంగా రెవెన్యూ లోటు రూ. 60,285 కోట్లకు చేరింది. మరోవైపు భవిష్యత్తు మౌలిక వసతులకు కీలకమైన క్యాపిటల్‌ ఔట్‌లే కేవలం రూ. 16,141 కోట్లే. బడ్జెట్‌ అంచనా రూ. 32,713 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు సగం.

2026–27 నాటికి ఆదాయ రాబడి రూ. 2,34,140 కోట్లుగా అంచనా వేయగా, రాష్ట్ర సొంత వనరులు రూ. 1,37,320 కోట్లు. అదే సమయంలో
వడ్డీ చెల్లింపులు రూ. 37,281 కోట్లు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికసంక్షోభాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సమస్యగా చూడటం సరికాదు. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ వ్యయమే అయినప్పటికీ... వైద్యం, విద్య, పోలీసు, రెవెన్యూ వంటి కీలక ప్రజాసేవలు వాటితోనే నడుస్తాయి. రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతున్నారు? భవిష్యత్తు అభివృద్ధికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు? అన్నవి ఈ సందర్భంలో తలెత్తుతున్న అసలు ప్రశ్నలు.
– సీహెచ్‌.వి. ప్రభాకర్‌ రావు ‘ సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement