అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ధరల కదలికలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను మరోసారి సవరించింది. పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయగా.. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్నును తగ్గించింది. సవరించిన రేట్లు ఆగస్టు 15 నుంచి తదుపరి 15 రోజుల పాటు అమల్లో ఉంటాయి.
కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. డీజిల్ ఎగుమతులపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) లీటరుకు రూ.25.50 నుంచి రూ.24కి తగ్గింది. ఏటీఎఫ్‌పై పన్ను రూ.22 నుంచి రూ.19.50కి దిగొచ్చింది. ఇక పెట్రోల్‌పై ఉన్న రూ.3.50 ఎగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. అంటే ఇక పెట్రోల్ ఎగుమతులపై ఈ లెవీ ఉండదు.
ఆగస్టులోనే రెండోసారి సవరణ
ఇంధన ఎగుమతి పన్నుల్లో ఈ మార్పు కీలకంగా మారింది. ఆగస్టు 3న కేంద్రం పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.2.50 నుంచి రూ.3.50కి పెంచింది. అదే సమయంలో డీజిల్‌పై మొత్తం ఎగుమతి సుంకం రూ.15.50 నుంచి రూ.25.50కి, ఏటీఎఫ్‌పై రూ.14.50 నుంచి రూ.22కి భారీగా పెంచింది.
అయితే రెండు వారాల్లోనే అంతర్జాతీయ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పరిస్థితుల్లో మార్పులు రావడంతో ప్రభుత్వం మళ్లీ రేట్లను తగ్గించింది. దీంతో ముఖ్యంగా పెట్రోల్ ఎగుమతిదారులకు పన్ను భారం పూర్తిగా తొలగిపోగా.. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతిదారులకు కూడా కొంత ఊరట లభించింది.
భారత్ పెట్రోలియం ఉత్పత్తులపై ఈ ఎగుమతి సుంకాలను స్థిరంగా ఉంచకుండా అంతర్జాతీయ ముడి చమురు ధరలు, ఇంధన ధరలు, రిఫైనింగ్ మార్జిన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తోంది.
దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం?
తాజా నిర్ణయం దేశీయంగా విక్రయించే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలపై నేరుగా ప్రభావం చూపదు. ప్రస్తుతం సవరించినవి ఎగుమతులకు వర్తించే ప్రత్యేక సుంకాలు మాత్రమే. గతంలోనూ ప్రభుత్వం ఎగుమతి సుంకాలను మార్చినప్పుడు దేశీయ వినియోగానికి సంబంధించిన ఎక్సైజ్ డ్యూటీలో మార్పు చేయలేదు.
అందువల్ల ఆగస్టు 15 నుంచి పెట్రోల్ ఎగుమతులపై పన్ను తొలగింపు, డీజిల్, ఏటీఎఫ్‌పై సుంకం తగ్గింపు ప్రధానంగా రిఫైనరీలు, ఇంధన ఎగుమతిదారుల ఆర్థిక భారాన్ని ప్రభావితం చేయనుంది. అంతర్జాతీయ చమురు మార్కెట్ పరిస్థితులను బట్టి సెప్టెంబర్ ప్రారంభంలో తదుపరి పక్షం సమీక్షలో ఈ రేట్లు మళ్లీ మారే అవకాశం ఉంటుంది.


