బుల్లితెరపై వాణిజ్య ప్రకటనల నిడివిపై దశాబ్దాలుగా అమలులో ఉన్న పరిమితికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్వస్తి చెప్పింది. టెలివిజన్ ఛానళ్లలో గంటకు గరిష్టంగా 12 నిమిషాలు మాత్రమే ప్రకటనలు ప్రసారం చేయాలనే నిబంధనను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడం, మార్కెట్‌లో సమాన పోటీతత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సవరణను చేపట్టినట్లు వెల్లడించింది.
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రూల్స్, 1994 ప్రకారం 2006లో ఈ 12 నిమిషాల నిబంధనను అమల్లోకి తెచ్చారు. అప్పట్లో దేశంలో కేవలం 62 ఛానళ్లు మాత్రమే ఉండగా డిజిటలీకరణ పెరిగిన తర్వాత ప్రస్తుతం వాటి సంఖ్య 900 దాటింది. అంతేకాకుండా యూట్యూబ్, ఓటీటీ వంటి డిజిటల్ మీడియా వేదికలపై ఎలాంటి ప్రకటనల పరిమితి లేకపోవడం వల్ల సాంప్రదాయ టీవీ ఛానళ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వం గుర్తించింది. 'పే' లేదా 'ఫ్రీ-టు-ఎయిర్' ఛానళ్లైనా ప్రకటనల ఆదాయంపైనే ప్రధానంగా ఆధారపడుతుండటంతో డిజిటల్ మీడియాతో సమానంగా పోటీపడే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.
డిజిటల్ కేబుల్, డీటీహెచ్, ఐపీటీవీ వంటి నూతన సాంకేతికతల వల్ల ప్రేక్షకులకు అనేక ఎంపికలు అందుబాటులోకి వచ్చాయని, మార్కెట్ స్వయం ప్రతిపత్తి సాధించిందని కేంద్రం స్పష్టం చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రూల్స్ సవరణల అధికారిక గెజెట్ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో టీవీ నెట్‌వర్క్‌ల ఆదాయ మార్గాలు మెరుగుపడనున్నాయని కొందరు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే..


