యువర్స్
ఇన్నోవేషన్
మిగిలినవారి కంటే భిన్నంగా ఆలోచించేవారు ఏకాగ్రతతో శ్రమిస్తే అద్బుతాలు సాధించవచ్చు.. ఎక్కడో మారుమూల.. కరెంటు కోతలే తప్ప ఇంటర్నెట్ మొహమెరుగని పల్లెటూరులో పుట్టినవాడు స్టార్టప్ మొదలుపెట్టాడు. మొదలుపెట్టడమే కాదు.. ప్రపంచ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.
కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లా అల్దూర్ గ్రామానికి చెందిన అవైస్ అహ్మద్ (28) చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగాడు. తనతోటి స్నేహితులు సినిమాలు, ఇన్‌స్టాగ్రామ్‌లను తెగచూస్తుంటే, అహ్మద్ మాత్రం తన తండ్రి తెచ్చిన సైన్స్ పుస్తకాలను తిరగేశాడు. బిట్స్ పిలానీలో చదివే అవకాశం పొందాడు.
బిట్స్ పిలానీలో చదువుతున్న రోజుల్లో అహ్మద్ కొన్ని ఉపగ్రహ ప్రాజెక్టులలో పాల్గొన్నాడు. పంటల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అవసరమైన ఖచ్చితమైన ఉపగ్రహ డేటా అందుబాటులో లేదన్న విషయాన్ని అహ్మద్ గ్రహించాడు. తన స్నేహితుడు క్షితిజ్ ఖండేల్‌వాల్‌తో కలిసి 2019లో ‘పిక్సల్’ పేరిట స్పేస్ టెక్ స్టార్టప్‌ను ప్రారంభించాడు.
అనతికాలంలోనే ఈ స్టార్టప్ పంటల ఆరోగ్యం, కాలుష్యం, మీథేన్ లీకులు, పర్యావరణ మార్పులను అత్యంత సూక్ష్మంగా గుర్తించడం వంటి కోణాల్లో అభివృద్ధి చేసిన హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాలు నాసా దృష్టిని ఆకర్షించాయి. ఈ సాంకేతికతను గుర్తించిన నాసా జియోలాజికల్ రీసెర్చ్ కోసం పిక్సల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అలా నాసాతో అధికారికంగా పని చేసిన తొలి భారతీయ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌గా పిక్సల్ సంస్థ నిలిచింది.


