జెన్‌ జీ: ఎవరి గోల వద్దు.. నా లైఫ్‌ నాదే! | Gen-Z Solo Maxing Youth Dating Self Improvement | Sakshi
Sakshi News home page

జెన్‌ జీ: ఎవరి గోల వద్దు.. నా లైఫ్‌ నాదే!

Aug 15 2026 8:29 AM | Updated on Aug 15 2026 8:29 AM

Gen-Z Solo Maxing Youth Dating Self Improvement

యువర్స్‌

జెన్‌ జీ.. నేటి తరం

తరం మారితే ఆలోచనా విధానం మారుతుంది కాని ఒక్క విషయంలో మాత్రం మారదు అదే ప్రేమ బంధాలు. టీనేజీ దాటకముందే ప్రేమ దోమ కుట్టిందని కూని రాగాలు తీస్తూ అల్లరి చేసే కుర్రమూక ప్రతి తరంలోనూ కనిపిస్తుంది. కాని ఇప్పుడున్న  జెన్‌ జీలు మాత్రం ఆ ప్రేమకు నోనో అంటున్నారు. కారణం ‘సోలో మాక్సింగ్‌’. పరిచయం పెంచుకోవడం, ప్రేమించుకోవడం, డేటింగ్, షాపింగ్, ట్రావెలింగ్‌ ఇలా దేనివైపు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మాకు ఎవరి గోలా వద్దు... మా గోల ఎవరికీ వద్దు అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు...

అసలేంటీ ‘సోలో మాక్సింగ్‌’?
ప్రేమ ముఖ్యమే కాని... అంతకంటే నన్ను నేను ప్రేమించుకోవడం ఇంకా ముఖ్యం...ఇదే సోలో మాక్సింగ్‌..అంటే ప్రేమ దోమ అంటూ తొక్కలో కమిట్‌మెంట్స్‌ పెట్టుకోకుండా, ఎవరితోనూ రొమాంటిక్‌ సంబంధాలు లేకుండా, ఉద్దేశపూర్వకంగా ఒంటరిగా ఉండటం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం, కెరియర్‌పై దృష్టి పెట్టడం, మొత్తంగా చెప్పాలంటే స్వీయాభివృద్ధికి పెద్దపీట వేయడమే ఈ సోలో మాక్సింగ్‌. ఈ ట్రెండ్‌లో భాగంగా యువత ఒంటరిగా ప్రయాణాలు చేయడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మానసిక ప్రశాంతత పొందడం, ఆర్థిక స్వావలంబన సాధించడం వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తమని తాము కోల్పోయే సంబంధాల కంటే తమని తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికే జెన్‌ జీలు ఉత్సుకత చూపుతున్నారు.

ఖర్చు తడిసి మోపెడు
గణాంకాలు కూడా ‘సోలో మాక్సింగ్‌’కి అనుకూలంగానే ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ మాంట్రియల్‌ 2026 రియల్‌ ఫైనాన్షియల్‌ ్రపోగ్రెస్‌ ఇండెక్స్‌ ప్రకారం అమెరికన్లు గడచిన ఏడాదిలో డేటింగ్‌ కోసం సగటున 2323 డాలర్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే భారత్‌లోని ముంబై వంటి నగరాల్లో ఒక సాధారణ డేట్‌ కోసం ప్రయాణం, ఆహారం, పానీయాలు, సినిమా కలిపితే ఐదు నుంచి ఆరు వేలవరకు ఖర్చవుతోంది. సరదాగా రెస్టారెంట్‌లో భోంచేయాలన్నా కూడా మూడు వేలు ఉండాల్సిందే.

ఇక డేటింగ్‌ యాప్‌లలో కేవలం హుక్‌ అప్‌ అవ్వడానికే కాని మానసిక ప్రశాంతత ఉండదని జెన్‌జీలు భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు నెలజీతంలో పెరుగుదల లేకపోవడమే కాకుండా ఉద్యోగంలో అనిశ్చితి కూడా తోడు కోసం వెతికేవారిని ఒకింత వెనకడుగు వేసేలా ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం యూత్‌లో వైరల్‌ అవుతున్న ఈ ట్రెండ్‌ని కొంతమంది స్వార్థంగా పరిగణిస్తున్నా, మానసిక నిపుణులు మాత్రం దీనిని స్వీయ క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన సంబంధాలకు పునాదిగా వ్యవహరిస్తున్నారు.

ఎందుకిలా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగాల్లో అస్థిరత, సోషల్‌ మీడియా ప్రభావం, ముందు తరంలో పెళ్లి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ప్రత్యక్షంగా చూడడం, ద్రవ్యోల్బణం, జీతంలో పెరుగుదల లేకపోవడం వంటి కారణాల వల్ల జెన్‌ జీలు సంబంధాలకు దూరంగా ఉంటున్నారు. చాలా మంది యువతని పెళ్లెప్పుడు అని అడిగితే ‘సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తూ జీవితం ఆపేయడం కంటే, ముందుగా నా జీవితాన్ని అందంగా నిర్మించుకుంటున్నాను’ అనే ఆశావాద దృక్పథాన్ని వెల్లడిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement