వక్రీకరించారు, దుర్వినియోగం చేశారు
యువతను తప్పుదారి పట్టించే కుట్ర
సందర్భ రహితంగా వ్యాఖ్యల ప్రసారం
కాక్రోచ్ వ్యాఖ్యపై సీజేఐ ఆవేదన
న్యూఢిల్లీ: కోర్టు విచారణల తాలూకూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందర్భ రహితంగా ప్రసారం అవుతూండటంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కాక్రోచ్‌లంటూ తాను చేసిన వ్యాఖ్యను దురుద్దేశంతో తప్పుగా చిత్రీకరించి, వాడి దేశ యువతను తప్పుదారి పట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మే నెల 15న ఒక కేసు విచారణ సందర్బంగా సీజేఐ మాట్లాడుతూ నకిలీ డిగ్రీలున్న కొంతమంది వ్యక్తులు వ్యవస్థలపై దాడి చేసేందుకు ఆర్టీఐ కార్యకర్తలుగా/సోషల్ మీడియాగా మారుతున్న వారిని బొద్దింకలు (కాక్రోచెస్)గా వరి్ణంచారు. అయితే ఈ వ్యాఖ్యపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగడం, ‘కాక్రోచ్ జనతా పారీ్ట’పేరుతో ఆన్‌లైన్ వ్యంగ్య ఉద్యమం ప్రారంభం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ దూరదర్శన్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కాలంలో కోర్టు విచారణల తాలూకూ క్లిప్‌లు సందర్భ రహితంగా సోషల్ మీడియాలో ప్రసారమవుతున్నాయని వ్యాఖ్యానించారు.
‘‘నా వ్యాఖ్యను వక్రీకరించారు. ఉపయోగించుకున్నారు. చెప్పనిదాన్ని కూడా చెప్పినట్టుగా చూపారు. ఇది చాలా దురదృష్టకరం. దేశ యువతను తప్పుదారి పట్టించేందుకు దురుద్దేశంతో చేసిన ప్రయత్నం’’అని చెప్పారు. జర్నలిస్టులు న్యాయ ప్రక్రియలకు సంబంధించిన రిపోరి్టంగ్‌కు బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించారు. సమాజంలో సామరస్య వాతావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి కర్తవ్యమని అన్నారు. ‘‘మీరు సోషల్ మీడియాలో ఉన్నారు. లేదంటే ప్రింట్ మరో రకమైన మీడియా. అదీ కాదంటే మీరు ఓ సాధారణ పౌరుడైనా కావచ్చు. అందరికీ హక్కులున్నాయి. రాజ్యాంగపరమైన విధులు, బాధ్యతలూ ఉన్నాయి’’అని చెప్పారు. ‘‘హక్కుల గురించి మాట్లాడితే మనం మన బాధ్యతలను కూడా నిర్వర్తించే సామర్థ్యం కలిగి ఉండాలి. కాబట్టి వాళ్లు తమ బాధ్యతలను మనసులో ఉంచుకోవాలని కోరుతున్నా. సమాజంలో సామరస్యం నెలకొని ఉండేలా చూసేందుకు మనమందరం శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి’’అని వివరించారు.
వ్యాపారం కోసం వాడుకున్నారు...
కోర్టు ప్రక్రియలకు సంబంధించిన ఆడియో, వీడియోలను సరైన అనుమతుల్లేకుండా ప్రసారం చేయడం, పోస్ట్, అప్‌లోడ్ చేయడం, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడంపై తాను ఇటీవల జారీ చేసిన ఆదేశాలను కూడా ప్రస్తావించిన సీజేఐ... న్యాయప్రక్రియల్లో పారదర్శకత అవసరమైనప్పటికీ అది వ్యాపారానికి దారి తీయకూడదని స్పష్టం చేశారు. పారదర్శకతకు కట్టుబడి ఉన్నందునే సు ప్రీంకోర్టులో ప్రత్యక్ష ప్రసారాలను మొదలుపెట్టామని, అయితే దీన్ని కూడా దుర్వినియోగం చేశారని, వ్యాపారం కోసం వాడుకున్నారని.. కొంతమంది చి న్న క్లిప్పులను (విచారణకు సంబంధించినవి) వ్యక్తిగత లాభాల కోసం దుర్వినియోగం చేశారని, మరికొందరు వ్యాపారం కోసం వాడుకున్నారని ఆయన చెప్పారు. దీనికి అడ్డుకట్ట పడాల్సిందేనన్నారు.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సీజేపీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నెల రోజులపాటు నిరసన ప్రదర్శనలు జరగడం జూలై 20న ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు తలెత్తడం తెలిసిందే. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. నిరసన కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది కూడా.


