నేడు ఆగస్టు - 15
మహనీయుల బాల్యం
కిడ్స్ స్పెషల్
పంజాబ్‌లోని బంగా గ్రామం. 1912వ సంవత్సరం. అప్పుడు భగత్‌సింగ్‌కు కేవలం 5 సంవత్సరాలు. ఒకరోజు తండ్రి కిషన్‌సింగ్‌తో కలిసి పొలానికి వెళ్లాడు. పెద్దలు రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్లు భారతీయులను ఎలా హింసిస్తున్నారో చర్చించుకుంటున్నారు.
చిన్న భగత్ నిశ్శబ్దంగా లేచి పొలంలో మట్టి తవ్వడం మొదలుపెట్టాడు. తండ్రి ఆశ్చర్యంగా ‘నాన్నా, ఏం చేస్తున్నావ్?’ అని అడిగాడు. ఆ చిన్నారి సమాధానం విని ఇద్దరూ అవాక్కయ్యారు. ‘తుపాకులు నాటుతున్నా నాన్నా’ అన్నాడు భగత్. ‘ఎందుకు?’ అని అడిగితే ‘తుపాకులు పండించి బ్రిటిష్ వాళ్లతో పోరాడి, జైలులో ఉన్న నా బాబాయిలను విడిపించడానికి’ అని ధైర్యంగా చెప్పాడు. 5 ఏళ్ల వయసులోనే దేశభక్తి, త్యాగం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాడు. ఇంట్లో జరిగే స్వాతంత్య్ర ఉద్యమ చర్చలు, బాబాయిల కథలు అతని మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే ఆ తర్వాత గొప్ప దేశభక్తుడిగా చరిత్రలో నిలబడిపోయాడు.
‘మాకొద్దీ తెల్లదొరతనము’ – గరిమెళ్ల సత్యనారాయణ
శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన కవి గరిమెళ్ల సత్యనారాయణ రాసిన దేశభక్తి గేయం ఇది. ఈ పాట రాసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైలు శిక్ష విధించింది. పేదరికంలో ఉన్నా కూడా ఆయన ఆశయాలను వదిలిపెట్టకుండా చివరి వరకు పోరాడారు.
‘మాకొద్దీ తెల్లదొరతనము’
మాకొద్దీ తెల్లదొరతనము – దేవా!
మాకొద్దీ తెల్లదొరతనము
మా ్రపాణాలపై పొంచి మానాలు హరియించే
పండ్రెండు దేశాలు పండుచున్నాగాని
పట్టెడన్నము లోపమండీ!
ఉప్పు ముట్టుకుంటే దోషమండీ!
నోట మట్టి తెచ్చి పెడుతాడండీ! అయ్యో!
కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు
ధనము చేర్చుకొని వాడు వెళ్ళిపోతాడు
మమ్ము దాస్యులుగ చేయ చూస్తాడు
వాడి పేరేని వినరాదండీ!
కూటికైనా గతి లేదు వాడి దయ రాదండీ!
గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోతే
గద్దించి చొక్కాలు ఊడదీస్తాడు
రాట్నములు బజార్ల పెట్టనివ్వడు
మాటలాడితే కోటలకు దాటిస్తాడు
వాడి తాతలు సంపాదించినట్లు
భూమిని వాడు పంచిపెడతాడు
మన భూములను వాడు దోచుకుంటాడు
మన నోళ్ళల్లో వాడు మట్టి కొడతాడు
మాకొద్దీ తెల్లదొరతనము.
మన్యం పులి అల్లూరి
పిల్లలూ... మన దేశానికి స్వాతంత్య్రం ఊరికే రాలేదు. ఎంతోమంది వీరుల రక్తతర్పణంతో వచ్చింది. అలాంటి మహానుభావులలో మన తెలుగు నేల గర్వించదగ్గ అపర మన్యం పులి... అల్లూరి సీతారామరాజు ఒకరు!
అల్లూరి 1897లో పశ్చిమగోదావరి జిల్లా మొగల్లు గ్రామంలో పుట్టారు. చిన్నప్పటి నుంచే ఆయనకు దేశభక్తి మెండు. యోగ, ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం. ఆయన చదువుతోపాటు కత్తిసాము, గుర్రపుస్వారీ కూడా నేర్చుకున్నారు.అప్పట్లో బ్రిటిష్ వాళ్లు మన అటవీ ్రపాంతాల చట్టాలు తెచ్చి, గిరిజనులను అడవుల్లోకి వెళ్లనీయలేదు. వాళ్ల పొట్ట కొట్టారు. రోడ్లు వేయడానికి గిరిజనులతో బలవంతంగా పని చేయించారు. ఇది చూసి అల్లూరి చాలా బాధపడ్డారు. ‘మన దేశం, మన అడవి, మన హక్కు’ అని ఆయన నినదించారు. ఆయన దగ్గర పెద్ద సైన్యం లేదు. కానీ గిరిజనులను కూడగట్టి బాణాలు, బరిశెలతో బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. ఆయన గెరిల్లా యుద్ధంలో ఎక్స్‌పర్ట్. అడవే ఆయన కోట.
బ్రిటిష్ వాళ్లు ఎంత వెతికినా అల్లూరిని పట్టుకోలేకపోయారు. చివరికి 1924 మే 7న మోయిదా గ్రామంలో ఆయనను కాల్చి చంపారు. చనిపోతూ కూడా ‘భారత్ మాతాకీ జై’ అన్నారు. అల్లూరి గారు మనకు నేర్పింది ఏంటి? అన్యాయాన్ని ఎదిరించాలి. మన ప్రజల కోసం, మన మట్టి కోసం పోరాడాలి. ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అల్లూరి లాంటి వీరుల త్యాగమే కారణం. మనం కూడా నిజాయితీగా చదివి, మంచి ΄ûరులుగా ఎదిగి దేశానికి సేవ చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.


