తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇస్తుండగా.. త్వరలో టీవీ రంగానికి కూడా అవార్డులు ఇవ్వబోతున్నారు. ఈ మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, టెలివిజన్ అవార్డు కమిటీతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్‌డీసీ ఎండీ ముకుంద రెడ్డి, కమిటీ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా టెలివిజన్(టీవీ) అవార్డులపై చర్చ జరిగింది.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 'టెలివిజన్(టీవీ), ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ నిచ్చే రంగం. ఎక్కువ మంది మహిళలు,వృద్ధులు టీవీ కార్యక్రమాల పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీల వారికి మంచి మెసేజ్ ఇచ్చే సీరియల్స్, ప్రోగ్రామ్స్, చిల్డ్రన్ చిత్రాలు తీసే వారిని ప్రోత్సహిస్తాం. కమిటీ సభ్యులు సూచించినట్లు దీనికి పి.వి నరసింహారావు పేరు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చిస్తాను'
'పి.వి నరసింహారావు.. బహుభాషా కోవిదుడు,తెలంగాణ ఠీవి. దేశాన్ని ఆర్ధికంగా నిలబెట్టిన గొప్ప మేధావి. అట్లాంటి పేరు పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. కమిటీ వీలైనంత త్వరగా గైడ్ లైన్స్, లోగో, అవార్డ్స్ పేరు లాంటివి తయారు చేసి ఇవ్వాలని సూచిస్తున్నాను. పేరయినా, లోగో అయినా తెలంగాణ ఆత్మని ప్రతిబింబించేలా ఉండాలి. మొట్టమొదటి సారి ఇవ్వబోయే ఈ అవార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను. పూర్తి పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేయాలని కమిటీ చైర్మన్,సభ్యులకు సూచిస్తున్నాను. అవార్డుల వేదిక కూడా రెండు మూడు ఆప్షన్స్ ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ అంశాలన్నీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు.


