ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక పార్కు భూసేకరణలో మాయాజాలం
రూ. కోట్లు కొట్టేసేందుకు అధికార పార్టీలోని బడా నేతలు, విపక్ష ఎమ్మెల్యే కుమ్మక్కు?
ఓ సంస్థ భూములను వేలంలో కొన్న మరో సంస్థ.. మ్యుటేషన్ జరగకపోవడంతో రంగంలోకి అక్రమార్కులు
500 ఎకరాలకుపైగా భూముల పరిహారం నొక్కేసేందుకు ఇతరుల పేరిట భూములు మార్చి దోపిడీకి స్కెచ్!
భూ బదలాయింపు జాబితాలో ఓ సిమెంట్ కంపెనీ సహా కొందరు వ్యక్తులు
ఈ వ్యవహారంపై విచారణ జరిపితే అక్రమాలు నిగ్గుతేలే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను అడ్డుపెట్టుకొని పరిహారం కొట్టేసేందుకు కొందరు అక్రమార్కులు స్కెచ్ వేశారు. బ్యాంకులో తనఖాలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థకు చెందిన భూములను అక్రమంగా తమ పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. సదరు ప్రైవేటు సంస్థ బ్యాంకులో తనఖా పెట్టిన భూములు ఆ సంస్థ పేరిట మ్యుటేషన్ కాకపోవడాన్ని అనువుగా మలుచుకున్నారు. దీంతో ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌లో అడ్డదారిలో రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కిన అక్రమార్కులనే పట్టాదారులుగా పేర్కొన్నారు. దీంతో తమవి కాని భూములపై రూ. కోట్లలో పరిహారం కొట్టేసేందుకు భూసేకరణ నోటిఫి కేషన్‌ను అక్రమార్కులు అడ్డుపెట్టుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పరిహారం కొట్టేసేందుకే పారి శ్రామిక పార్కు ఏర్పాటు ప్రతిపాద నను తెర పైకి తెచ్చారని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ ప్రయత్నాలకు అధికార పార్టీకి చెందిన బడా నేతలతోపాటు విపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుడి సహకారం ఉందని సమాచారం. కేంద్రంలో రోజూ కత్తులు దూసు కునే పార్టీల ముఖ్య నేతలు పరిహారం కొట్టేసేందుకు కలసి కట్టుగా కుట్ర పన్నినట్లు ఆరోపణలు వస్తున్నా యి. ఈ ఉదంతానికి సంబంధించి ‘సాక్షి’ పరిశీలన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ముందు కొన్నదొకరు.. వేలంలో కొన్నదొకరు
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం హత్తీఘాట్, రాంపూర్, గూడ, గిమ్మబి గ్రామాల్లో 2062.01 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా హత్తీఘాట్ పరిధిలో 1,194.10 ఎకరాలు, గూడలో 259.23 ఎకరాల భూసేకరణకు మే 29న రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. హత్తీఘాట్‌లో 298 సర్వే నంబర్లు, గూడలో 83 సర్వే నంబర్ల పరిధిలోని భూమిని సేకరిస్తున్నట్లు యజమానుల పేర్లతో నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే జీఎస్ బయోటెక్ లిమిటెడ్ అనే సంస్థ బ్యాంకులో తనఖా పెట్టిన భూములు కూడా ఇందులో ఉన్నాయి. ఆదిలాబాద్‌కు చెందిన ఈ సంస్థ.. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌తోపాటు మహారాష్ట్రలోని నాందేడ్‌లో స్థానికుల నుంచి 3,103.41 ఎకరాల భూమి కొనుగోలు చేసింది.
కాలక్రమంలో ఈ భూములను ఎస్‌బీఐ, యుకో, బ్యాంక్ ఆఫ్ మారిషస్ వంటి బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ. వందల కోట్లు రుణం తీసుకుంది. అయితే జీఎస్ బయోటెక్ రుణాలు చెల్లించకపోవడంతో ఎస్‌బీఐ నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించింది. 2022 చివరి నాటికే తమకు రూ. 770 కోట్లకుపైగా రావాల్సి ఉందని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023 మార్చిలో హైదరాబాద్ ఎన్‌సీఎల్‌టీ దివాలా ప్రక్రియను ప్రారంభించినా అది ముందుకు సాగలేదు. దీంతో కంపెనీ ఆస్తుల విక్రయానికి (లిక్విడేషన్) 2024 సెప్టెంబర్‌లో ఆమోదం లభించింది. 2025 డిసెంబర్ 31న జరిగిన ఈ వేలంలో బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రూ. 40.20 కోట్లకు ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని భూములతోపాటు మరికొన్ని భూములను దక్కించుకుంది.
ఈ మేరకు జీఎస్ బయోటెక్ లిక్విడేటర్ ఈ ఏడాది జనవరి 12న వేలంలో అత్యధిక బిడ్ వేసిన సంస్థకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) కూడా పంపించారు. బిడ్‌ను పొందిన బెంగళూరు సంస్థ.. ఆ భూములను తమ పేరిట రెవెన్యూ రికార్డుల్లో బదలాయింపు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఈ పని కాకపోవడంతో భూసేకరణ నోటిఫికేషన్‌లో సదరు భూములకు సంబంధించిన యజమానిగా ఈ సంస్థ పేరు లేదు. గతంలో జీఎస్ బయోటెక్ పేరిట మ్యుటేషన్ జరగకపోవడంతో ఆ సంస్థ పేరు కూడా లేదు. దీంతో పరిహారం దోపిడీకి తెరలేచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమంగా ఇతరుల పేరిట మార్చి..
గతంలో భూములు అమ్మిన యజమానులతో కుమ్మక్కైన అక్రమార్కులు.. జీఎస్ బయోటెక్‌కు చెందిన 500 ఎకరాలకుపైగా భూములను వక్ర మార్గంలో ఇతరుల పేర్లకు మార్చి దోపిడీకి తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరహాలో భూములు పొందిన జాబితాలో డెక్కన్ సిమెంట్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విపక్ష ఎమ్మెల్యే కుమారుడు, కుటుంబ సభ్యులతోపాటు రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన అత్యంత కీలక నేతలు ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పారిశ్రామిక పార్కు భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లోని సర్వే నంబర్లలోని వివరాలు కూడా అనుమానాలను బలపరిచేలా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువకు 3–4 రెట్లు అధికంగా పరిహారం వచ్చే అవకాశం ఉండటంతో రూ. కోట్లు కొట్టేసే ప్రణాళికల్లో భాగంగానే పారిశ్రామిక పార్కు ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఏరియల్ సర్వేలో అధికార పార్టీ నేతలతోపాటు విపక్ష ఎమ్మెల్యే కూడా పాల్గొనడాన్ని స్థానికులు ప్రస్తావిస్తున్నారు. సుమారు 500 ఎకరాలకు సంబంధించి జీఎస్ బయోటెక్ భూములను అక్రమార్కులు తమ పేరిట మార్చుకున్నట్లు సమాచారం.
సర్వే నంబర్ 39లో ఎన్ని అక్రమాలో..!
హత్తీఘాట్ సర్వే నంబర్ 39లోని 33.31 ఎకరాలను జీఎస్ బయోటెక్‌కు చెందిన సుమన్ అగర్వాల్ 2006 డిసెంబర్ 11న (డాక్యుమెంట్ నంబర్ 361/06) కొనుగోలు చేశారు. మరుసటి ఏడాది ఎస్‌బీహెచ్‌కు తనఖా (డాక్యుమెంట్ నంబరు 4790/07) పెట్టారు. అయితే ఇదే భూమిని తూడెం గణేశ్ అనే వ్యక్తి ఉగ్గె సత్యనారాయణ (డాక్యుమెంట్ 7068/2016)కు విక్రయించినట్లు రికార్డుల్లో ఉంది. తిరిగి అదే వ్యక్తి డెక్కన్ సిమెంట్స్‌కు 33.31 ఎకరాలు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖ జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌లో డెక్కన్ సిమెంట్స్ పేరిట 30.31 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో గూడ గ్రామంలోని 112/1/3 సర్వే నంబర్ భూములు కూడా విపక్ష ఎమ్మెల్యే కుమారుడు డెక్కన్ సిమెంట్స్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. అలాగే సర్వే నంబర్లు 114, 115, 117తోపాటు పలు సర్వే నంబర్లకు సంబంధించి జరిగిన లావాదేవీలు, లిక్విడేటర్ వేలం వేసిన భూముల్లో సైతం ఇవే సర్వే నంబర్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంపై లోతైన విచారణ జరిపితే అక్రమాలు పూర్తిస్థాయిలో బయటపడే అవకాశం ఉంది.


