హైడ్రా ఎపిసోడ్‌లో ట్విస్ట్‌: రేవంత్‌ సర్కార్‌ ప్లాన్‌ ఏంటంటే.. | Telangana Govt Plans Appeal After HC Directs Removal Of HYDRAA Commissioner Ranganath, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

హైడ్రా ఎపిసోడ్‌లో ట్విస్ట్‌: రేవంత్‌ సర్కార్‌ ప్లాన్‌ ఏంటంటే..

Jul 28 2026 8:52 AM | Updated on Jul 28 2026 12:38 PM

Revanth Govt Plans Appeal After HC Orders HYDRAA Ranganaths Removal

సాక్షి, హైదరాబాద్‌: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను పదవి నుంచి తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన్ని తప్పిస్తారా? వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా?.. అనే చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అయితే ఈ విషయంలో తొందరపాటు వద్దని రేవంత్‌ సర్కార్‌ భావిస్తున్నట్లు సమాచారం. 

హైడ్రా చర్యలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ విచారణలో భాగంగా.. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి తప్పించాలని హైకోర్టు సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నరలో ఆయనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదవడం అసాధారణమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను గౌరవించడం చట్టబద్ధ పాలనకు కీలకమని పేర్కొంది. ప్రజా ఆస్తుల పరిరక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించే అధికారం ఏ సంస్థకూ లేదని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడం గ్యారెంటీ అనే చర్చ మొదలైంది.  

అయితే కోర్టు ఆర్డర్‌ కాపీని అధికారికంగా అందుకుని పరిశీలించాకే తర్వాతే ముందుకు వెళ్లాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. ఇప్పటికే అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)తో పాటు న్యాయ నిపుణుల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. 

అప్పీల్‌పై ప్రభుత్వ కసరత్తు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. సీఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించి న్యాయపరమైన అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తిస్థాయిలో పరిశీలించి డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రస్తుతం హైడ్రా కమిషనర్‌ వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్నారు. అయితే ఆయనను పదవి నుంచి తప్పించాలన్న ఆదేశాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీ కావడంతో.. అప్పీల్‌ ఎవరు దాఖలు చేయాలి? ప్రభుత్వం తరఫున వెళ్లాలా? లేదంటే రంగనాథ్‌ వ్యక్తిగతంగా అప్పీల్‌ చేయాలా? అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.

రంగనాథ్‌ వివరణ.. ‘కబ్జాదారులే కేసులు వేశారు’
మరోవైపు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తనపై ఉన్న 63 ధిక్కరణ కేసులు భూకబ్జాదారులు వేసినవేనని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను రక్షించే క్రమంలోనే ఈ కేసులు ఎదుర్కొంటున్నానన్నారు. రెండేళ్లలో హైడ్రా ద్వారా మార్కెట్‌ విలువ ప్రకారం సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు రక్షించామని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తితోనే చేపట్టామని చెప్పారు. తనపై వచ్చిన కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

హైడ్రా కమిషనర్ గా రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశాలు

హైడ్రా ఏర్పాటు అలా.. 
చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కుల పరిరక్షణ లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2024లో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (HYDRAA)ను ఏర్పాటు చేసింది. కేబినెట్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 99 ద్వారా హైడ్రాకు అధికారిక రూపం కల్పించారు. నగరంలో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల రక్షణలో హైడ్రాను రేవంత్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మక సంస్థగా భావిస్తోంది. ముఖ్యంగా చెరువులు, నాలాల పరిరక్షణ అంశాన్ని ప్రభుత్వం తన పాలనలో కీలక అజెండాగా తీసుకుంది.

హైడ్రా భవిష్యత్‌పై ఉత్కంఠ
ఇదిలా ఉండగా.. హైడ్రా పనితీరు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా సాధించిన ఫలితాలను ప్రభుత్వం వివరించనుంది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు అమలవుతాయా? లేదంటే ప్రభుత్వం అప్పీల్‌తో ముందుకు వెళ్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. డివిజన్‌ బెంచ్‌లో జరిగే విచారణే హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కొనసాగింపుపై కీలకంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement