స్వాతి (ఫైల్)
హైదరాబాద్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ వాటర్ హీటర్ ఉపయోగిస్తుండగా షాక్‌కు గురై మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. భువనగిరికి చెందిన స్వాతి (40), భర్త శ్రీనివాస్, ముగ్గురు పిల్లలతో కలిసి మల్లికార్జున నగరంలో నివాసముంటోంది. శ్రీనివాస్ చర్లపల్లిలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు.
సోమవారం ఉదయం భర్త డ్యూటీకి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తరువాత డోర్ వేసుకున్న స్వాతి వేడినీటి కోసం బకెట్‌లో ఎలక్ట్రిక్ వాటర్‌హీటర్ వేసిన సమయంలో ప్రమాదవశాత్తు చెయ్యి వాటర్‌హీటర్ ఉన్న నీటిని తాకింది. దీంతో తీవ్ర కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి నుండి పొగలు వస్తుండడాన్ని గమనించిన పై పోర్షన్ వారు భర్తకు సమాచారం అందించడంతో అతను వచ్చి లోపలకు వెళ్లి చూడగా కాలిన గాయాలతో మృతి చెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మేడిపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


