విజయవాడ: చూడ ముచ్చటైన జంట.. అనురాగం.. ప్రేమ, ఆప్యాయతలతో సంతోషంగా సాగుతున్న సంసారం.. ఏడేళ్ల ఆ బంధానికి ఇద్దరు మగపిల్లల సంతానం.. అంతా బాగుందని అనుకున్న ఆ చిన్న కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో.. ఏమో కానీ భార్యాభర్తలిద్దరూ విషం తాగి మృత్యువు ఒడికి చేరిపోయారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవీనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం కలకలం సృష్టించింది.
ఏం జరిగిందంటే..
దేవీనగర్ ప్రాంతానికి చెందిన తాడిశెట్టి బాజీ సైదులు(30), జలసూత్రం మానస(27)కు పెద్దల సమక్షంలో 2019లో వివాహమైంది. వీరికి సంజయ్(5), సంతోష్ (ఏడాదిన్నర) కుమారులు ఉన్నారు. సైదులు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో అవుట్ సోర్సింగ్ విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మానస ఇంటి వద్దే ఉంటూ టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఆదివారం ఉదయం సైదులు తన పిల్లలిద్దరినీ ఇందిరా నాయక్‌నగర్‌లోని తన సోదరుడు నాగుల్‌మీరా వద్ద దింపి పనులకు వెళ్లగా మానస వారి ఇంటి సమీపంలోని చర్చికి ఉదయం పది గంటలకు వెళ్లి మధ్యాహ్నం రెండు గంటల తిరిగి ఇంటికి వచ్చింది.
సాయంత్రం ఐదు గంటల సమయంలో సైదులు తన మావయ్య వీరభద్రరావుకు ఫోను చేసి దంపతులిద్దరం విషం తాగేశామని.. ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పాడు. దీంతో అతను తన వియ్యంకుడు ఏడుకొండలు, సైదులు సోదరుడు నాగుల్‌మీరాకు ఫోను చేసి హూటాహూటిన వారి ఇంటికి వెళ్లి తలుపులు పగలకొట్టి అపస్మారక స్థితిలో పడి ఉన్న భార్యాభర్తలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న భార్యాభర్తలిద్దరూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందారు. దీంతో వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఆన్‌లైన్‌లో ఆర్డరు పెట్టుకొని..
సైదులు, మానస ఎంతో అన్యోన్యంగా ఉంటారని, వారికి ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేవని వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలతో మాటామాటా పెరిగి క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో గడ్డిమందు, కూల్‌డ్రింక్‌ను ఆర్డర్ పెట్టుకొని డ్రింక్‌లో దానిని కలుపుకొని ఇద్దరూ తాగినట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అజిత్‌సింగ్‌నగర్ సీఐ దాడి చంద్ర శేఖర్ తెలిపారు.


