సాక్షి, శ్రీకాకుళం: భూ కొనుగోలు వ్యవహారంలో గత కొన్నిరోజులుగా తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. తాను ఎప్పుడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని, భూమి కొనుగోలులో ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతే భూమిని కొనుగోలు చేశామని తెలిపారు.
భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని తమ్మినేని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాల పరిశీలన అనంతరం రిజిస్ట్రేషన్ జరిగిందని, ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదని చెప్పారు.
వివాదం తెలిసిన వెంటనే కోర్టును ఆశ్రయించాం
కొనుగోలు చేసిన భూమిపై వివాదం ఉన్న విషయం తెలిసిన వెంటనే తాము కూడా చట్టపరమైన మార్గాన్ని ఎంచుకున్నామని తమ్మినేని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంగా ఈ వ్యవహారం సివిల్ కోర్టులో విచారణలో ఉందని చెప్పారు. ‘‘ఈ భూ వ్యవహారంలో మేము కూడా బాధితులమే. సివిల్ వివాదం కొనసాగుతుండగానే క్రిమినల్ కేసు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాం
తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి చట్టపరంగా కోర్టు ముందు వాదనలు వినిపిస్తామని తమ్మినేని తెలిపారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని, అవసరమైన అన్ని పత్రాలను సమర్పిస్తామని చెప్పారు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందన్న నమ్మకం ఉందని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మాజీ స్పీకర్ పేర్కొన్నారు.
భూ వ్యవహారంపై రాజకీయంగా చర్చ
తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు ప్రస్తుతం శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భూ కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు, కేసుల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. అయితే చట్టపరమైన ప్రక్రియ ద్వారా అన్ని విషయాలు స్పష్టమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తమ్మినేని దంపతులను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని రిజిస్టర్ చేయించుకున్నారన్న ఆరోపణలపై శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు నమోదు చేసిన కేసులో తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణికి హైకోర్టు ఊరట లభించింది. వారిద్దరికీ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వరకు వారిద్దరినీ అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని ఆయన్ని ఆదేశించింది. ఈ నెల 29న 10 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. వాణి వయసు 65 ఏళ్లు కావడంతో ఆమె విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు తేల్చి చెప్పింది.
కాగా, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సీతారాం కుమారుడు వెంకట శ్రీరాం చిరంజీవి నాగుకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భూమి రిజిస్ట్రేషన్‌తో సీతారాం, ఆయన భార్య వాణికి సంబంధం లేదన్న సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.


