స్థానికంగా ఇందిరమ్మ ఇళ్లపై హర్షాతిరేకాలు
కల నెరవేరుతుందని పేదల ఆశలు
దూరాభారం తగ్గుతుందని ఆనందం
ఆసక్తి చూపుతున్న పేద, మధ్యతరగతి
సాక్షి, హైదరాబాద్: గవర్నమెంటుఇళ్లు అంటే సాధారణంగా.. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో.. శివారులో.. నిర్మానుష్య ప్రదేశాల్లో ఇస్తారనే అపవాదు ఉంది. ఇవి ఉపాధి కేంద్రాలకు దూరంగా.. సౌకర్యాలకు నోచుకోక లబ్ధిదారులు నివాసానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి చెక్ పెట్టేందుకు తాజాగా ప్రభుత్వం స్థానిక ప్రాంతాల్లోనే అనువైన చోట ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు నివాసిత ప్రాంతాల్లోనే చాలా చోట్ల స్థలాలను ఎంపిక చేశారు. దీంతో ఈసారి ఇందిరమ్మ ఇళ్లపై జనంలో ఆసక్తి పెరిగింది. దీంతో ఒక వైపు ఉచిత ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా భవన్, కలెక్టరేట్ ప్రజావాణిలకు, మరోవైపు ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు కేంద్రాలకు పోటెత్తుతున్నారు.
గతంలో ఏం జరిగిందంటే...
వాస్తవంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కోసం లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిరి్మస్తామని ప్రకటించింది. ఐదేళ్లలో సుమారు 111 ప్రాంతాల్లో 68,176 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించగా, మిగిలిన మరో 31,824 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో నిలిచిపోయాయి. అయితే, ఈ ఇళ్లు చాలావరకు నగరం వెలుపల, జీవనోపాధి లభించే ప్రాంతాలకు అత్యంత దూరంలో ఉండటం సమస్యగా తయారైంది. రోజువారి కూలిపనులు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే లబ్ధిదారులు నిత్యం రాకపోకలు సాగించలేక అక్కడ నివాసం ఉండడం లేదు. వాటిని అద్దెకు ఇవ్వడమో..తాళాలు వేయడమో చేస్తున్నారు.
ఇప్పుడు ఇందిరమ్మ మోడల్ కాలనీలు
రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర సామాజిక, ఆరి్థక సర్వే ద్వారా ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి లబ్ధిదారులకు వారు నివసిస్తున్న ప్రాంతానికి గరిష్టంగా 5 కిలోమీటర్ల సమీపంలోనే ‘ఇందిరమ్మ మోడల్ కాలనీలు’ నిర్మించి ఇళ్లు అందజేస్తామని ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో స్ధలాలను సైతం గుర్తించింది. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రత్యేకంగా హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేసింది. స్థానికంగానే సొంత గూడు దక్కుతుందనే నమ్మకంతో నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తు చేస్తున్నారు.
రాయితీతో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్లు
మరోవైపు, హౌసింగ్ శాఖ పరిధిలోని ‘క్యూర్’ ఎల్‌ఐజీ, ఎంఐజీ లక్ష ఇళ్ల లక్ష్యంతో పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల కోసం స్థానికంగా జీ+10 నివాస గృహాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల మొదటి విడత పైలెట్ ప్రాజెక్టుగా 16 ప్రాంతాల్లో సుమారు 7680 ఎల్‌ఐజీ గృహాల కోసం గృహ నిర్మాణశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల వరద పారుతోంది.
కలల గూడు కోసం..
నగరంలో ఇళ్లు లేని పేదలు తమ గోడు వెళ్లబోసుకునేందుకు కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. సోమవారం ప్రజావాణికి మొత్తం 2433 దరఖాస్తులు రాగా..వాటిలో 2254 ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయి. గత వారం కూడా ఇళ్లకోసం 1462 మంది అర్జీ పెట్టుకున్నారు.


