భారత్‌లో ఈ20 పెట్రోల్‌పై గత కొంతకాలంగా.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ కలపడం వల్ల ఇంధన నాణ్యతపై ప్రభావం పడుతుందా?.. క్లోరైడ్, తేమ లేదా నీరు కలిసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ నమూనాలను పరీక్షించాయి.
దేశంలోని రిఫైనరీల నుంచి సేకరించిన 100కు పైగా పెట్రోల్ నమూనాలను పరీక్షించగా.. వాటిలో క్లోరైడ్ స్థాయి 1 ppm లేదా అంతకంటే తక్కువగా నమోదైంది. 80 డిస్టిలరీల నుంచి సేకరించిన ఇథనాల్ నమూనాల్లో క్లోరైడ్ స్థాయి 3 ppm కంటే తక్కువగా ఉంది. డిపోలు, టెర్మినల్స్ నుంచి సేకరించిన 80కి పైగా ఈ20 నమూనాల్లో కూడా క్లోరైడ్ స్థాయి 3 ppm కంటే తక్కువగానే ఉన్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.
ఇదే సమయంలో.. దేశవ్యాప్తంగా సుమారు 90,000 పెట్రోల్ బంకుల్లోని భూగర్భ ట్యాంకులను కూడా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ట్యాంకుల్లోకి నీరు చేరినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని సంస్థలు పేర్కొన్నాయి. దీంతో ఈ20 పెట్రోల్ నాణ్యతపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణంగానే ఈ20 పెట్రోల్‌ను ఉపయోగించవచ్చని చమురు సంస్థలు చెబుతున్నాయి.
చమురు సంస్థలు ఎన్ని చెబుతున్నా.. ఈ20పై వినియోగదారుల నుంచి విమర్శలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పాత వాహనాల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ తగ్గడం లేదా వాహనం పనితీరులో మార్పులు రావచ్చని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా పాత వాహనాలలో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నట్లు వాహన వినియోగదారులు పేర్కొంటున్నారు.


