E20 పెట్రోల్‌తో ఇంజిన్లు పాడవుతున్నాయా? | Is E20 Petrol Damaging Engines? SIAM Retracts Previous Letter and Issues Clarity | Sakshi
Sakshi News home page

E20 పెట్రోల్‌తో ఇంజిన్లు పాడవుతున్నాయా?

Aug 5 2026 9:10 AM | Updated on Aug 5 2026 10:14 AM

Is E20 Petrol Damaging Vehicle Engine SIAM Retracts Letter Issues Clarity

దేశంలో E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలపిన పెట్రోల్‌) పెట్రోల్ వినియోగం, ఇంధన నాణ్యతపై ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వార్తలపై ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్’ (సియామ్‌) స్పష్టత నిచ్చింది. సాంకేతిక చర్చలలోని కొన్ని అంశాలను పాక్షికంగా చర్చించిన తర్వాత చేసిన ప్రచారాన్ని ఖండిస్తూ మునుపటి లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

భారత ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నాం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన E20 ఇంధన రంగానికి ఆటోమొబైల్ పరిశ్రమ పూర్తిగా మద్దతు ఇస్తుందని సియామ్ స్పష్టం చేసింది. దేశ ఇంధన స్వయంసమృద్ధి, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఇథనాల్ బ్లెండింగ్ అత్యంత కీలకమైనదని తెలిపింది. వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యమని పేర్కొంది.

కఠినమైన నాణ్యతా ప్రమాణాలు

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇథనాల్ సరఫరా ప్రక్రియలో క్లోరైడ్, సల్ఫర్ స్థాయిలను గరిష్టంగా 3 పీపీఎం పరిమితికి లోబడి ఉంచాలని ముందు జాగ్రత్త మార్గదర్శకాలను జారీ చేసిందని సియామ్ గుర్తుచేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజూ 150కి పైగా పారామితుల్లో ఇంధనాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాయని తెలిపింది.

నిరంతర తనిఖీలు

దేశవ్యాప్తంగా ఉన్న 87,000కు పైగా పెట్రోల్ బంకుల్లో ఇంధనంలో నీరు చేరకుండా రోజుకు 8 నుంచి 12 సార్లు తనిఖీలు నిర్వహిస్తున్నారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా పరీక్షించిన వేల కొద్దీ శాంపిళ్లలో వ్యత్యాసాలు అత్యంత అరుదుగా మాత్రమే నమోదయ్యాయని వివరించింది. ఆటోమొబైల్ తయారీదారులు, ఆయిల్ కంపెనీలు, సాంకేతిక నిపుణుల మధ్య ఇంధన నాణ్యతపై చర్చలు నిరంతరం సాగే ప్రక్రియ అని, మీడియాలో వచ్చిన కథనాలను ప్రాతిపదికగా తీసుకుని వాహనదారులు, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సియామ్ స్పష్టం చేసింది.

మునుపటి లేఖలో ఇలా..

‘E20 పెట్రోల్‌లో క్లోరైడ్, తేమ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల ఇంధన నాణ్యత దెబ్బతింటోంది. ఫలితంగా వాహనాల ఇంజిన్ భాగాలు త్వరగా తుప్పు పట్టి పాడవుతున్నాయి. ఫ్యూయల్ పంపులు, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఈజీఆర్ వాల్వ్‌లు, ఎగ్జాస్ట్ వ్యవస్థలోని ఇతర కీలక భాగాలు త్వరగా పాడైపోతున్నాయి. వాటి రీప్లేస్‌మెంట్‌లు భారీగా పెరిగాయి’ అని సియామ్ మునుపటి లేఖ ద్వారా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement