3.3 రెట్లు అధిక బిడ్స్
నేడు రిటైలర్లకు విండో ఓపెన్
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) ఆఫర్ ఫర్ సేల్‌కు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన కనిపించింది. వెరసి దేశీయంగా ఆఫర్ ఫర్ సేల్ విభాగంలో కొత్త రికార్డ్‌కు తెరతీస్తూ ఏకంగా రూ. 36,400 కోట్ల విలువైన (3.3 రెట్లు అధికంగా) బిడ్స్ దాఖలయ్యాయి. ప్రభుత్వం ఒక్కో షేరుకీ రూ. 382 ఫ్లోర్ ధరలో తొలుత 2.5 శాతం వాటా(31.62 కోట్ల షేర్లు) ఆఫర్ చేసింది.
మంగళవారం(4న) రూ. 383.84 సంకేత ధరలో 94.45 కోట్ల షేర్లకు బిడ్స్ నమోదయ్యాయి. దీంతో తొలి రోజు గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్లకు 4 శాతం వాటా(50.6 కోట్ల షేర్లు) విక్రయించనున్నట్లు దీపమ్ కార్యదర్శి అరునిష్ చావ్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ బాటలో నేడు(5న) రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం 10 శాతం డిస్కౌంట్ ధరలో బిడ్డింగ్(మరో 8.22 కోట్ల షేర్లు)కు విండో ఓపెన్ కానుంది. ఆఫర్‌లో భాగంగా ప్రభుత్వం రెండు రోజుల్లో మొత్తం 6.5 శాతం వాటా(82.22 కోట్ల షేర్లు) విక్రయించనున్న సంగతి తెలిసిందే. వెరసి ప్రభుత్వం రూ. 31,000 కోట్లు సమకూర్చుకోనుంది.
10 శాతం వాటా
ఆఫర్‌కు ముందు ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా 96.5 శాతంకాగా.. 6.5% వాటా విక్రయంతో 90 శాతానికి దిగిరానుంది. దీంతో కంపెనీలో సాధారణ వాటాదారులకు కనీసం 10% వాటా నిబంధన అమలుకానుంది. 2022 మే నెలలో ప్రభుత్వం ఐపీవో చేపట్టడం ద్వారా ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించిన విషయం విదితమే. షేరుకి రూ. 949 ధరలో రూ. 21,000 కోట్లు అందుకుంది.
ఎల్‌ఐసీ షేరు బీఎస్‌ఈలో 8% పతనమై రూ. 391 వద్ద ముగిసింది.


