ఎల్‌ఐసీ ఆఫీస్‌ ఎక్కడుందో కూడా తెలీదు!  | Donot even know where LIC office, says Rajesh Exports chief Rajesh Mehta | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ ఆఫీస్‌ ఎక్కడుందో కూడా తెలీదు! 

Jun 9 2026 4:10 AM | Updated on Jun 9 2026 4:10 AM

Donot even know where LIC office, says Rajesh Exports chief Rajesh Mehta

రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ చైర్మన్‌ రాజేష్‌ మెహతా 

కంపెనీలో ఎల్‌ఐసీ పెట్టుబడులపై వ్యాఖ్యలు 

న్యూఢిల్లీ: ఇటీవల వివాదాలలో చిక్కుకున్న ఆభరణ వర్తక కంపెనీ రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ కౌంటర్లో బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) పెట్టుబడులపై వాడి, వేడి చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్‌ఐసీ ఆఫీస్‌ ఎక్కడుందో కూడా తనకు తెలియదని రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ చైర్మన్‌ రాజేష్‌ మెహతా తాజాగా వ్యాఖ్యానించారు. కంపెనీలో ఎల్‌ఐసీ పెట్టుబడులు నిన్నటివి లేదా ఏడాది క్రితం చేసినవి కాదని పేర్కొన్నారు. 

సుమారు రెండు రెండు దశాబ్దాల కాలంలో చేపట్టిన పెట్టుబడులివని తెలియజేశారు. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేర్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. వెరసి కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో తానకుగానీ లేదా ఇతర ప్రమోటర్లకుగానీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. కంపెనీ ప్రమోటర్లు ఎవరూ ఎల్‌ఐసీకి వాటా విక్రయించలేదని వెల్లడించారు. 

ఇదేవిధంగా ఎల్‌ఐసీకి ఎలాంటి షేర్ల కేటాయింపునూ చేపట్టలేదని తెలియజేశారు. రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌లో బీమా దిగ్గజం చేపట్టిన పెట్టుబడులతో కంపెనీ లేదా ప్రమోటర్లకు ఎలాంటి లబ్ది చేకూరలేదని  స్పష్టం చేశారు. ఎల్‌ఐసీ పెట్టుబడి నిర్ణయాలలో తమకు ఏ విధమైన సంబంధమూలేదని, ఈ విషయాలు తెలియవని వివరించారు. పూర్తిగా వాణిజ్య ధృక్పథంతో ఎల్‌ఐసీ తీసుకున్న సొంత నిర్ణయాలేనని పేర్కొన్నారు.  

10.8 శాతం వాటా 
ప్రస్తుతం రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌లో ఎల్‌ఐసీ వాటా 10.8 శాతంగా నమోదైంది. తొలి దర్యాప్తులో భాగంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కంపెనీ అక్రమ ఆదాయ నమోదుపై సీరియస్‌ అయ్యింది. రాజేష్‌ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ అంశంలో సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ షేరు సోమవారం సైతం 5 శాతం పతనమై రూ. 94.5 వద్ద ఫ్రీజయ్యింది. మూడు రోజుల్లో 14 శాతం క్షీణించింది. 

అయితే తనకున్న అవగాహన ద్వారా ఈ ధరలోనూ ఎల్‌ఐసీ నష్టపోయి ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ నష్టపోయి ఉంటే అవతలి పక్క మరొకరు లాభపడి ఉండాలని, ఇది సాధారణ పబ్లిక్‌ వాటాదారులేనని మెహతా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తొలిసారి మాట్లాడుతున్నానని, ఒకవేళ ఇప్పుడు ఎల్‌ఐసీ విక్రయిస్తుంటే కామన్‌ పబ్లిక్‌ కొనుగోలు చేస్తుంటారని, తద్వారా లబ్ది పొందుతారని, అంతేతప్ప కంపెనీ లేదా ప్రమోటర్‌ లాభపడరని వివరించారు. ఈ అంశాన్ని  వ్యతిరేకించేవారు సాధారణ వాటాదారులు లాభపడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement