భారత్‌లో మరో 13 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్
ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాపై ఫోకస్
అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ వెల్లడి
ప్రధాని మోదీతో భేటీ
న్యూఢిల్లీ: భారత్‌లో దీర్ఘకాలిక విస్తరణ వ్యూహంలో భాగంగా టెక్ దిగ్గజం అమెజాన్ కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ సదుపాయాలను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం తాజాగా 13 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.23 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో 2026–30 మధ్య కాలంలో భారత్‌లో అమెజాన్ పెట్టుబడులు 48 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి.
గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం కంపెనీ సీఈవో ఆండీ జస్సీ ఈ విషయాలు వెల్లడించారు. వ్యాపార వృద్ధికి సంబంధించి భారత్ తమకు కీలక మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఆయన చెప్పారు. దేశీయంగా ఈ–కామర్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) విభాగాలవ్యాప్తంగా కస్టమర్ల నుంచి డిమాండ్ పటిష్టంగా ఉంటోందని జస్సీ వివరించారు.
డిజిటల్ వినియోగం, క్లౌడ్–ఏఐ సర్వీసులకు డిమాండ్ పెరుగుతుండటంతో భారత్‌లో పలు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అమెజాన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘భారత్‌లో అమెజాన్ రికార్డు స్థాయిలో 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్వాగతిస్తున్నాను. యువతకు దీనితో కొత్త అవకాశాలు లభిస్తాయి‘ అని ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ‘వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారంపై ప్రధాని మోదీ విజన్ మాకు స్ఫూర్తిదాయకం. భారత వృద్ధి గాథలో మేము దీర్ఘకాలిక భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని జస్సీ పేర్కొన్నారు.
20 ఏళ్లలో 88 బిలియన్ డాలర్లు..
తాజా ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా కలిపి 2010–2030 మధ్య కాలంలో భారత్‌లో 88 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని అమెజాన్ తెలిపింది. ఈ ఏడాది కొత్తగా 20 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 100 లాస్ట్–మైల్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ప్రధానంగా టియర్ 3, టియర్ 4 నగరాల్లో ఇవి రానున్నట్లు తెలిపింది.
అలాగే, తమ ఈ–కామర్స్, క్విక్ కామర్స్ నెట్‌వర్క్‌కి దన్నుగా ఉంటున్న వేల మంది డెలివరీ ఏజెంట్ల సంక్షేమం కోసం ’సమ్మాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అమెజాన్ తెలిపింది. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటైజ్ చేసినట్లు, 20 బిలియన్ డాలర్లకు పైగా ఈ–కామర్స్ ఎగుమతులు, 28 లక్షల ఉద్యోగాలకు తోడ్పాటు అందించినట్లు అమెజాన్ వివరించింది. అలాగే కోటి మంది భారతీయులకు క్లౌడ్ నైపుణ్యాల్లో శిక్షణ కల్పించినట్లు పేర్కొంది. నిమిషాల్లో డెలివరీ సేవల నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించే దిశగా 300 పైగా నగరాల్లో అమెజాన్ నౌ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.
హైదరాబాద్, ముంబై డేటా సెంటర్ల విస్తరణ..
తాజా పెట్టుబడులతో హైదరాబాద్, ముంబైలోని ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంకుర సంస్థలు, ఎంటర్‌ప్రైజ్‌లు .. ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు, భారీగా కార్యకలాపాలను విస్తరించేందుకు, అంతర్జాతీయంగా కస్టమర్లకు సేవలందించేందుకు ఉపయోగపడే ఏఐ చిప్‌లు, మేనేజ్డ్ ఏఐ సర్వీసులు, సురక్షితమైన క్లౌడ్ టెక్నాలజీలు, డెవలపర్ టూల్స్‌ను మరింత అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.
2030 నాటికి 38 లక్షల కొలువుల కల్పనకు, 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులకు ఈ పెట్టుబడులు తోడ్పడనున్నట్లు తెలిపింది. 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు, నలభై లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలు అందుబాటులోకి రాగలవని వివరించింది. నేషనల్ హెల్త్ అథారిటీ, గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్, అపోలో టైర్స్, డెల్హివెరీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఫిజిక్స్‌వాలా మొదలైనవి తమ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నట్లు
అమెజాన్ పేర్కొంది.


