భారతీయ రియల్ ఎస్టేట్ రంగ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఉన్న డీఎల్ఎఫ్ లగ్జరీ ప్రాజెక్ట్ ‘ది దాలియాస్’లోని ఒక సూపర్ లగ్జరీ పెంట్‌హౌస్ ఏకంగా రూ.271 కోట్లకు అమ్ముడై దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థ ‘ఇంపీరియల్ ఆటో’ గ్రూప్‌నకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా ఈ డీల్‌ను దక్కించుకున్నారు.
దేశంలోనే అత్యధిక ధర
ఈ ప్రాపర్టీ ధరల వివరాలు రియల్టీ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ పెంట్‌హౌస్ సూపర్ ఏరియా 17,200 చదరపు అడుగులు కాగా కార్పెట్ ఏరియా 10,500 చదరపు అడుగులు. సూపర్ ఏరియా ప్రాతిపదికన చదరపు అడుగుకు రూ.1.58 లక్షలు పడగా, కార్పెట్ ఏరియా లెక్కన చదరపు అడుగుకు ఏకంగా రూ.2.6 లక్షలు వ్యయమైంది. సాధారణంగా ముంబైలోని వర్లీ, మలబార్ హిల్స్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి భారీ ధరలు కనిపిస్తాయి. అయితే గురుగ్రామ్‌లో ఒక్క సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ రూ.271 కోట్లకు అమ్ముడవడం భారతదేశపు అత్యంత ఖరీదైన హౌసింగ్ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఎవరీ మానవ్ సర్దానా?
1969లో ఫరీదాబాద్‌లో ఎస్.బి. సర్దానా, జగ్‌జీత్ సింగ్‌లు ప్రారంభించిన ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్ ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది. ఫ్లూయిడ్ ట్రాన్స్‌మిషన్ ప్రొడక్ట్స్ (పైప్‌లైన్లు, హోస్ అసెంబ్లీలు) తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థకు భారత్‌లో 20కి పైగా, విదేశాల్లో 3 ఉత్పాదన కేంద్రాలు ఉన్నాయి. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం 'వార్‌బర్గ్ పింకస్' ఈ సంస్థను కొనుగోలు చేసుకున్నప్పటికీ సర్దానా కుటుంబం ఇంపీరియల్ ఆటో గ్రూప్‌లో క్రియాశీలకంగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..


