డిజిటల్ కంటెంట్ ద్వారా ఆదాయం ఆర్జించాలనుకుంటున్న క్రియేటర్లకు ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్’ ఊహించని షాక్ ఇచ్చింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) ద్వారా యాడ్స్, సబ్‌స్క్రిప్షన్ల నుంచి డబ్బులు సంపాదించడానికి అవసరమైన ప్రాథమిక అర్హత ప్రమాణాల్లో మార్పులను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
కొత్త నిబంధనలు ఇవే..
ప్రస్తుతం చలామణిలో ఉన్న నిబంధనల ప్రకారం కంటెంట్ క్రియేటర్లు ఏడాది కాలంలో (365 రోజుల్లో) 4,000 గంటల వాచ్ టైమ్ సాధించాల్సి ఉంది. నూతన ఉత్తర్వుల ప్రకారం ఇకపై 8,000 గంటల వాచ్ టైమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ పొందాలనుకునే వారు గత 90 రోజుల్లో పొందే వ్యూస్ పరిమితిని 10 మిలియన్ల నుంచి 20 మిలియన్లకు (2 కోట్లు) పెంచారు. అయితే, కనీసం 1,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలనే పాత నిబంధనలో ఎలాంటి మార్పూ చేయలేదు.
ఈ నూతన నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనితో పాటు, ఇప్పటికే మానిటైజేషన్ పొందుతున్న క్రియేటర్లు కూడా షార్ట్స్ ద్వారా ఆదాయం కొనసాగించాలంటే ప్రతి 90 రోజుల వ్యవధిలో నిరంతరం 10 మిలియన్ల వ్యూస్ నిర్వహించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ఎందుకు ఈ నిర్ణయం?
ఇటీవలి కాలంలో ప్లాట్‌ఫామ్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన లో-క్వాలిటీ, కాపీడ్, రీసైకిల్డ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది. నాణ్యమైన అసలైన కంటెంట్ సృష్టికర్తలకు ప్రాధాన్యత ఇవ్వడానికి, ప్రకటనకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి గూగుల్ ఈ కఠిన చర్యలు చేపట్టింది.
చిన్న క్రియేటర్లపై ప్రభావం
యూట్యూబ్‌ను పూర్తికాల కెరీర్‌గా ఎంచుకోవాలని భావిస్తున్న ఔత్సాహిక క్రియేటర్లకు, చిన్న ఛానెళ్ల నిర్వాహకులకు ఈ నిర్ణయం గొడ్డలిపెట్టుగా మారనుంది. ఆదాయ మార్గాలు సాధించాలంటే మునుపటి కంటే రెండింతలు శ్రమించాల్సి రావడంతో ప్రారంభ దశలోనే అనేకమంది నిరాశకు గురయ్యే అవకాశాలున్నాయని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..


