పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సంక్షోభం, హార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాల ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వంటగ్యాస్ (ఎల్‌పీజీ) ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా వ్యయం పెరిగినా దేశీయంగా గృహ వినియోగదారులకు భారం పడకుండా తక్కువ ధరకు విక్రయించడంతో ప్రభుత్వ రంగానికి చెందిన చమురు మార్కెటింగ్ కంపెనీల (IOCL, BPCL, HPCL) ‘అండర్ రికవరీ’ (అమ్మకపు లోటు) 2026 జులై 31 నాటికి రూ.59,000 కోట్లకు పైగా పెరిగింది. ఈ మేరకు పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి అధికారిక వివరాలను వెల్లడించారు.
పరిహారం ఉన్నప్పటికీ పెరుగుతున్న లోటు
పెట్రోలియం కంపెనీల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.22,000 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా ఆర్థిక సంవత్సరాలు 2025-26, 2026-27ల కాలానికి మరో రూ.30,000 కోట్ల పరిహారాన్ని మంజూరు చేసింది. మొత్తం రూ.52,000 కోట్ల ప్రభుత్వ సహాయం అందినప్పటికీ అంతర్జాతీయంగా ప్రొపేన్-బ్యూటేన్ బెంచ్ మార్క్ ధరలు భారీగా పెరగడంతో బకాయిపడ్డ అండర్ రికవరీ మొత్తాలు రూ.59,000 కోట్ల మార్కును దాటాయి.
నెలవారీ పరోక్ష సబ్సిడీ మార్పులు
ఢిల్లీలో 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.942 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల పెట్రో కంపెనీలు భరించే పరోక్ష సబ్సిడీ (అండర్ రికవరీ) జూన్‌లో ప్రతి సిలిండర్‌పై రూ.700 కంటే ఎక్కువగా, జులైలో రూ.500 వరకు నమోదు కాగా ఆగస్టు నాటికి గ్లోబల్ ధరలు కొంత నెమ్మదించడంతో ఈ లోటు రూ.188కి తగ్గింది. ఇక పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తించే రూ.300 నిర్దేశిత సబ్సిడీతో కలిపి సిలిండర్ రూ.642కే లభిస్తోంది.
గతంలో భారత్ తన వంటగ్యాస్ దిగుమతుల్లో 90% వరకు పశ్చిమాసియా పైనే ఆధారపడేది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో ఖతార్ వంటి దేశాల నుంచి సరఫరా తగ్గినప్పటికీ అమెరికా నుంచి రికార్డు స్థాయిలో (జులైలో 9.12 లక్షల టన్నులు) ఎల్పీజీని దిగుమతి చేసుకుంటూ సరఫరాల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (ఇప్పటివరకు 1.7 కోట్లకు పైగా కనెక్షన్లు), ఇండక్షన్ స్టవ్‌ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
ఇదీ చదవండి: గౌతమ్ అదానీకి భారీ ఊరట


