సోషల్ మీడియా దిగ్గజాలకు కోర్టులో చుక్కెదురు | Social Media Addiction Lawsuits US Court Rejects Section 230 Defense for Big Tech | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియా దిగ్గజాలకు కోర్టులో చుక్కెదురు

Aug 11 2026 8:49 AM | Updated on Aug 11 2026 8:49 AM

Social Media Addiction Lawsuits US Court Rejects Section 230 Defense for Big Tech

పిల్లలు, యువతను తమ ప్లాట్‌ఫారమ్‌లకు బానిసలుగా మార్చేలా అల్గోరిథమ్‌లను రూపొందించాయనే ఆరోపణలపై బిగ్ టెక్ దిగ్గజాలు మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఆల్ఫాబెట్ (గూగుల్/యూట్యూబ్), బైట్‌డాన్స్ (టిక్‌టాక్), స్నాప్‌చాట్‌లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థలపై నమోదైన 3,000కు పైగా ఫెడరల్ దావాలను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్లను శాన్‌ఫ్రాన్సిస్కోలోని ‘9వ యూఎస్‌ సర్క్యూట్ కోర్ట్ అఫ్ అప్పీల్స్’ తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులన్నీ విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

వీగిపోయిన ‘సెక్షన్ 230’ రక్షణ కవచం

యూజర్ల కంటెంట్‌కు ప్లాట్‌ఫారమ్‌లు బాధ్యత వహించవని పేర్కొనే ‘కమ్యూనికేషన్స్ డిసెన్సీ యాక్ట్ - సెక్షన్ 230’ కింద తమకు విచారణ నుంచి మినహాయింపు ఉందని టెక్ సంస్థలు వాదించాయి. అయితే, సెక్షన్ 230 విచారణలో ఒక వాదన మాత్రమే తప్ప, కేసుల ప్రారంభంలోనే పూర్తి రక్షణ కల్పించదని, ఈ అప్పీలు సమయానుకూలంగా లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాట్‌ఫారమ్‌ల రూపకల్పన, వాటికే అలవాటు పడేలా చేసే ఫీచర్ల వల్ల కలిగే నష్టాలపై దావాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.

మానసిక ఆరోగ్య సంక్షోభంపై ఆందోళన

వివిధ రాష్ట్రాల అటార్నీ జనరళ్లు, పాఠశాలల బోర్డులు, తల్లిదండ్రులు వేసిన ఈ దావాల్లో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగుచూశాయి. పిల్లలలో డిప్రెషన్, ఆందోళన, శారీరక స్థితిపై అభద్రతాభావం, చివరికి ఆత్మహత్య ధోరణులు పెరగడానికి ఈ సోషల్ మీడియా డిజైన్లే ప్రధాన కారణమని పిటిషనర్లు ఆరోపించారు. ఇటీవల న్యూమెక్సికోలో మెటాకు 567 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించడం, లాస్ ఏంజిల్స్ కోర్టులో బాధితురాలికి 6 మిలియన్‌ డాలర్ల పరిహారం ప్రకటించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.

పరిశ్రమపై ప్రభావం

కేవలం వినియోగదారుల ఎంగేజ్‌మెంట్‌కు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా 'ఇన్ఫినిట్ స్క్రోలింగ్', 'ఆటోప్లే' వంటి ఫీచర్లను ప్రవేశపెట్టిన టెక్ సంస్థల బాధ్యతారాహిత్యానికి ఈ తీర్పు ఒక హెచ్చరికని నిపుణులు చెబుతున్నారు. లాభాల కంటే పిల్లల డిజిటల్ భద్రతే ప్రాధాన్యమని నిరూపించే దిశగా ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగాన్ని ఇది సరికొత్త నియంత్రణల వైపు నడిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: గౌతమ్ అదానీకి భారీ ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement