సూచీల్లో తీవ్ర హెచ్చుతగ్గులపై కన్ను...
ముంబై: స్టాక్ ఎక్సే్చంజీల్లో కొత్తగా ప్రవేశపెట్టిన 15 నిమిషాల క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) సందర్భంగా ఆరంభంలో చోటు చేసుకున్న తీవ్ర హెచ్చుతగ్గులపై నియంత్రణ సంస్థ సెబీ కన్నేసింది. మార్కెట్ లావాదేవీలు సాధారణంగానే నమోదయ్యాయా, లేదంటే ముగింపు ధరలను ప్రభావితం చేసేందుకు ఏవైనా అవకతవకలు చోటు చేసుకున్నాయా అనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 3, 4 తేదీల్లో నమోదైన ట్రేడ్ డేటాను ఇప్పటికే ఎక్సే్చంజీలు అందించాయని, వాటిని సెబీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సీఏఎస్‌ను ప్రవేశపెట్టిన తొలి రోజున అంటే ఆగస్ట్ 3న నిఫ్టీ మధ్యాహ్నం 3.28కి 24,573 స్థాయిలో ఉండగా, 3.30కి ఒక్కసారిగా 24,774కు జంప్ చేసింది. చివరి నిమిషాల్లో ఏకంగా 201 పాయింట్లు దూసుకెళ్లింది. అలాగే, ఆగస్ట్ 4న కూడా 3 గంటలకు నిఫ్టీ 24,463 వద్ద నుంచి 3.15కల్లా 152 పాయింట్లకు (24,615) ఎగబాకింది. సూచీల్లో ఈ భారీ వ్యత్యాసానికి కారణాలేంటనేది నిగ్గుతేల్చేందుకు సెబీ సంబంధిత డేటాను విశ్లేషించే పనిలో పడింది.
అవకతవకల రిస్క్ ఎక్కువ..
కాగా, సీఏఎస్ సెషన్‌లో బలహీన లిక్విడిటీ కారణంగా అవకతవల రిస్క్ పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా క్యాష్ మార్కెట్ టర్నోవర్ చాలా తక్కువగా ఉండటం వల్ల సూచీలు, స్టాక్స్‌లో ఈ ప్రమాదం అధికంగా ఉంటుందని మార్కెట్ పార్టిసిపెంట్లు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు ఏదైనా పెద్ద ఫండ్ సంస్థ లేదా కొంతమంది ఆపరేటర్లు ఒక ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తూ, ఆదే సమయంలో సంబంధిత ఇండెక్స్‌లో పొజిషన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు (ప్యాసివ్ కొనుగోళ్ల ద్వారా ఇండెక్స్ పెరుగుతుందన్న అంచనాలతో). సీఏఎస్ సెషన్‌లో ఈ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా సూచీలను ప్రభావితం చేసే చాన్సుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ముగింపు ధరలు మరింత సహేతుకంగా ఉండేలా, అదేవిధంగా షేరు ధరల నిర్ధారణను మెరుగుపరచడం, ట్రేడింగ్ అవకతవకలు జరగకుండా చూసేందుకు 3.15 నుంచి 3.30 వరకు సీఏఎస్ సెషన్‌ను సెబీ అమల్లోకి తీసుకొచి్చన సంగతి తెలిసిందే.


