ఎయిర్టెల్, ఐటీఐ లిమిటెడ్ కంపెనీలు కలిసి కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. పాత టెక్నాలజీ వ్యవస్థలను అప్డేట్ చేయడం, కార్యకలాపాలను మరింత సులభంగా నిర్వహించడం, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ రెండు సంస్థలు జత కట్టాయి.
ఎయిర్టెల్, ఐటీఐ లిమిటెడ్ సంస్థలు తమ టెక్నాలజీ, ఇంజినీరింగ్ సామర్థ్యాలను కలిపి.. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలకు కొత్త డిజిటల్ సొల్యూషన్స్ అందించనున్నాయి. అంతే కాకుండా.. ఎంటర్‌ప్రైజ్ కనెక్టివిటీ, డేటా సెంటర్లు, సావరిన్ క్లౌడ్, ఏఐ ఆధారిత సొల్యూషన్స్, ఎల్ఈఓ శాటిలైట్ సేవలు, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో సేవలను అందించనున్నారు.
ముఖ్యంగా బ్యాంకింగ్.. ప్రభుత్వ రంగ సంస్థలు వంటి సున్నితమైన రంగాలకు సురక్షితమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించడంపై ఈ కంపెనీలు దృష్టి పెట్టనున్నారు. దీంతో 4G/5G వంటి హైస్పీడ్ కనెక్టివిటీతో పాటు.. ఏఐ ఆధారిత అనలిటిక్స్, IoT ఆధారిత ట్రాకింగ్, క్లౌడ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఇక దేశ రక్షణ, భద్రత అవసరాలకు కూడా ఈ భాగస్వామ్యం ఉపయోగపడేలా ప్రయత్నించనున్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా దేశీయ టెక్నాలజీ సామర్థ్యాలను పెంచేందుకు రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.


