దేశీయంగా టెలికం సబ్‌స్క్రైబర్స్ సంఖ్య జూన్‌లో 134.8 కోట్లకు చేరింది. భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లలో కొత్తగా యూజర్లు చేరడం ఇందుకు దోహదపడింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మే నెలతో పోలిస్తే జూన్‌లో భారతి ఎయిర్‌టెల్ కస్టమర్లు 31.63 లక్షల మంది పెరిగారు. ఇందులో 29.89 లక్షల మొబైల్ సబ్‌స్క్రైబర్స్, 1.73 లక్షల ఫిక్సిడ్ లైన్ కనెక్షన్లు ఉన్నాయి.
రిలయన్స్ జియోలో నికరంగా 22.91 లక్షల మంది చేరారు. వీరిలో 21.46 లక్షల మంది మొబైల్ సెగ్మెంట్, 1.44 లక్షల మంది ఫిక్సిడ్ లైన్ సెగ్మెంట్ యూజర్లు ఉన్నారు. జూన్‌లో నికరంగా 62 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ జత కాగా ఇందులో 54.54 లక్షల మంది టాప్ రెండు టెలికం దిగ్గజాలైన ఎయిర్‌టెల్, జియోకి చెందిన వారే ఉన్నారు. వొడాఫోన్ ఐడియాలో నికరంగా 1.64 లక్షల మంది వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్స్ చేరగా, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌లో 94,006 యూజర్లు జతయ్యారు. ఎంటీఎన్‌ఎల్‌లో 11,284 మంది తగ్గారు.
1,580 మంది ఆపరేటర్లు దాఖలు చేసిన సమాచారం ప్రకారం మే నెలలో 108 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య జూన్‌లో 108.75 కోట్లకు చేరింది. మొత్తం మీద 53.22 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ యూజర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్‌కి 37.99 కోట్ల మంది, వొడాఫోన్ ఐడియాకి 13 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్ 2.7 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ!


