టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: విమానయాన దిగ్గజం ఎయిరిండియా పరివర్తనకు కనీసం అయిదు నుంచి పదేళ్లు పడుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. అనేక సంవత్సరాలుగా కీలక విడిభాగాల సరఫరాలో అవాంతరాలు ఏర్పడిన నేపథ్యంలో సిస్టమ్‌లు, సంస్కృతి, విమానాలు, భారీ స్థాయిలో నిపుణులను తీర్చిదిద్దుకోవడానికి అంత సమయం అవసరమవుతుందని వివరించారు. ఇప్పటికే ఈ దిశగా గణనీయంగా పురోగతి సాధించామని టాటా సన్స్ 2025–26 వార్షిక నివేదికలో ఆయన పేర్కొన్నారు.
‘ఎయిరిండియాను పునర్నిర్మించడమనేది సుదీర్ఘ ప్రయాణం. ఫ్లీట్ రెన్యువల్, శిక్షణ, సర్వీసులను గాడిలో పెట్టడం, నెట్‌వర్క్‌ని విస్తరించడం.. ఇలా ఎన్నో ఉంటాయి. ఘనచరిత్ర గల ప్రతి ఎయిర్‌లైన్ నిర్మాణానికి దశాబ్దాల కాలం పట్టేసింది. ఏవో కొన్ని త్రైమాసికాల్లో జరిగిపోలేదు‘ అని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా మూడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చిందని చంద్రశేఖరన్ చెప్పారు.
గగనతలం మూసివేత, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన ధరలు పెరిగిపోవడం.. విదేశీ మారక విలువలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావడం, ఏఐ171 విమానం కూలిపోవడంలాంటి అంశాలతో గత ఆర్థిక సంవత్సరం ఎయిరిండియాకు సవాళ్లతో కూడుకున్నదిగా గడిచిందని తెలిపారు. అయితే, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఎయిరిండియా సిబ్బంది దీటుగా స్పందించారని ఆయన తెలిపారు. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను 2022 జనవరిలో ప్రభుత్వం నుంచి టాటా సన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.


