నష్టాల ఎఫెక్ట్: ‘మీ బట్టలు మీరే ఉతుక్కోండి’ | Air India Ends International Layover Laundry Service For Crew From July 1 | Sakshi
Sakshi News home page

నష్టాల ఎఫెక్ట్: ‘మీ బట్టలు మీరే ఉతుక్కోండి’

Jun 27 2026 11:26 AM | Updated on Jun 27 2026 11:29 AM

Air India Ends International Layover Laundry Service For Crew From July 1
  • ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం 
  • అంతర్జాతీయ రూట్లలో క్రూ సిబ్బందికి లాండ్రీ సేవలు బంద్‌
  • పైలట్లు, క్యాబిన్ క్రూకి ఇక కష్టాలే..
  • జూలై ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు

న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తమ పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి ఊహించని షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ సర్వీసుల లేఓవర్ (విదేశాల్లో విమాన విరామ సమయం) సమయంలో సిబ్బందికి ఇప్పటివరకు అందిస్తున్న ఉచిత లాండ్రీ (దుస్తులు ఉతికే) సేవలను జూలై  ఒకటి నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూడటంతో, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా వస్తున్న ఈ సాంప్రదాయానికి స్వస్తి పలుకుతుండటంతో సిబ్బంది కొంత సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని అంతర్గత ఈమెయిల్‌లో ఎయిర్ ఇండియా పేర్కొంది.

హోటల్ గదుల్లో ఇస్త్రీ పెట్టెలు
ఇకపై అంతర్జాతీయ లేఓవర్ల సమయంలో హోటల్ లాండ్రీ సేవలకు బదులుగా, క్రూ సిబ్బంది ఉండే గదుల్లోనే ఐరన్ బాక్స్ (ఇస్త్రీ పెట్టె), ఐరన్ బోర్డులను అందుబాటులో ఉంచనున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. అదనంగా యూనిఫామ్‌ సెట్లు కావాలనుకునే ఉద్యోగులు ప్రత్యేక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, విదేశీ ప్రయాణాలకు ముందే తగిన ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించింది. అయితే దేశీయ లేఓవర్లలో (డొమెస్టిక్ రూట్లలో) మాత్రం ఈ లాండ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అలాగే విమానాల మళ్లింపు, అంతర్జాతీయ స్టేషన్లలో సిమ్యులేటర్ లేదా క్లాస్‌రూమ్ శిక్షణ వంటి ప్రత్యేక సందర్భాలకు ఈ కొత్త నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చారు.

అంతర్జాతీయ ప్రమాణాల కోసమే..
ఈ నిర్ణయాన్ని ఎయిర్ ఇండియా సమర్థించుకుంది. సాధారణంగా పైలట్లు, క్యాబిన్ క్రూ సభ్యులకు నాలుగు సెట్ల యూనిఫామ్‌లను ఇస్తామని, అంతర్జాతీయ పర్యటనల రొటేషన్ నిర్వహణకు ఇవి సరిపోతాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. విదేశీ ప్రయాణాల్లో యూనిఫామ్ మెయింటెనెన్స్‌ను రోజువారీ ఇతర ఖర్చుల కింద సిబ్బందే చూసుకోవడం అంతర్జాతీయంగా సాధారణ విషయమేనని స్పష్టం చేసింది.

సిబ్బంది అసంతృప్తి
ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ పొదుపు చర్యలపై సిబ్బంది నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంపై కొంతమంది ఉద్యోగులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఇకపై తాము అంతర్జాతీయ ప్రయాణాలకు వెళ్లేటప్పుడు యూనిఫామ్‌లు ఉతుక్కోవడానికి బకెట్, డిటర్జెంట్ సర్ఫ్, బట్టలు ఆరేసుకునే తాడును కూడా వెంట తీసుకెళ్లాలేమోనంటూ వ్యంగ్యంగా నవ్వుకుంటున్నారు. యాజమాన్యం ఖర్చులు తగ్గించుకోవడానికి ఇలాంటి చిన్న విషయాలపై ఆంక్షలు విధించడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ‘ట్రంప్‌ కన్నా పుతిన్ బెటర్‌’.. తేల్చేసిన భారతీయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement