‘ట్రంప్‌ కన్నా పుతిన్ బెటర్‌’.. తేల్చేసిన భారతీయులు | Trump vs Putin Who Do Indians Trust More for World Affairs | Sakshi
Sakshi News home page

‘ట్రంప్‌ కన్నా పుతిన్ బెటర్‌’.. తేల్చేసిన భారతీయులు

Jun 27 2026 10:18 AM | Updated on Jun 27 2026 10:28 AM

Trump vs Putin Who Do Indians Trust More for World Affairs
  • ప్రపంచ వ్యవహారాల్లో పుతిన్‌పైనే భారత్‌కు నమ్మకం
  • పడిపోయిన అమెరికా క్రేజ్‌ 
  • ప్యూ రీసెర్చ్ సర్వేలో సంచలన నిజాలు

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యవహారాలను చక్కదిద్దడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పైనే భారతీయులు ఎక్కువ నమ్మకం ఉంచారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా గ్లోబల్ సర్వేలో వెల్లడయ్యింది. ఫిబ్రవరి 8 నుండి మే 13, 2026 మధ్య కాలంలో 36 దేశాల్లోని 42,151 మందిపై నిర్వహించిన ఈ అంతర్జాతీయ పోల్‌లో, ట్రంప్ నాయకత్వంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా అంతకుముందుతో పోలిస్తే భారతదేశంలో ట్రంప్‌ పట్ల నమ్మకం గణనీయంగా తగ్గడం గమనార్హం.

రష్యా వైపే భారత్ మొగ్గు.. పుతిన్‌కు జై
ఈ సర్వే నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలరని 51 శాతం మంది భారతీయులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరైన నిర్ణయాలు తీసుకోగలరని కేవలం 39 శాతం మంది భారతీయులు మాత్రమే నమ్మారు. గత ఏడాది సర్వేలో ట్రంప్‌కు భారతదేశంలో 51 శాతం మద్దతు ఉండగా, ఈసారి అది భారీగా పడిపోవడం అమెరికా విదేశాంగ విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ విధానాలపై భారతీయుల తీవ్ర అసంతృప్తి
భారతదేశంలో ట్రంప్ గ్రాఫ్ పడిపోవడానికి ఆయన తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలే కారణమని సర్వే స్పష్టం చేసింది. అంతర్జాతీయ సుంకాలు, వెనిజువెలా, ఇరాన్ సంక్షోభాల విషయంలో ట్రంప్  తీరును మెజారిటీ భారతీయులు తప్పుపట్టారు. అలాగే అమెరికా అమలు చేస్తున్న కఠినమైన వలస విధానాలను కేవలం 32 శాతం మందే సమర్థించారు. అంతర్జాతీయ సహాయక సంస్థ అయిన ‘యూఎస్ఏఐడి’ని మూసివేయడం, గాజా స్ట్రిప్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలను డొనాల్డ్ ట్రంప్ డీల్ చేసిన విధానంపై కూడా భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌కు నిరాశే..
భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని 16 దేశాల్లో ట్రంప్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. సర్వేలో పాల్గొన్న మొత్తం దేశాల్లో 76 శాతం మంది ట్రంప్ నాయకత్వంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని తేల్చి చెప్పారు. కేవలం 23 శాతం మంది మాత్రమే ఆయనను సమర్థించారు. జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాలతో పాటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లోనూ ట్రంప్‌కు అతి తక్కువ రేటింగ్స్ వచ్చాయి. అయితే, ఇజ్రాయెల్‌లో మాత్రం అత్యధికంగా 66 శాతం మంది ట్రంప్ నిర్ణయాలను సమర్థించడం విశేషం.

ఇది కూడా చదవండి: ట్రంప్ మరో హెచ్చరిక.. ఇక డిజిటల్ ట్యాక్స్‌ వంతు!
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement