ట్రంప్ మరో హెచ్చరిక.. ఇక డిజిటల్ ట్యాక్స్‌ వంతు! | Trump Warns of 100 Tariff Over Digital Taxes | Sakshi
Sakshi News home page

ట్రంప్ మరో హెచ్చరిక.. ఇక డిజిటల్ ట్యాక్స్‌ వంతు!

Jun 27 2026 8:51 AM | Updated on Jun 27 2026 9:01 AM

Trump Warns of 100 Tariff Over Digital Taxes
  • అమెరికా టెక్ దిగ్గజాల జోలికొస్తే వదిలేదే లేదు 
  • పాత ఒప్పందాలు రద్దు
  • ఐరోపా దేశాలపై ట్రంప్ పిడుగు!

వాషింగ్టన్‌: అమెరికా సాంకేతిక రంగ దిగ్గజాల జోలికి వస్తే సహించేది లేదంటూ ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. యునైటెడ్ స్టేట్స్ కంపెనీలపై ఎవరైనా డిజిటల్ సేవల పన్ను (డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్) విధిస్తే, ఆయా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 100 శాతం టారిఫ్ (సుంకం) విధిస్తామని ఆయన ప్రకటించారు. శ్వేతసౌధం వేదికగా శనివారం వెలువడిన  ఈ  ప్రకటన ప్రపంచ వాణిజ్య రంగంలో కలకలం రేపుతోంది. అమెరికా టెక్ కంపెనీలను టార్గెట్ చేస్తూ పన్నులు విధించేందుకు సిద్ధమవుతున్న ఐరోపా దేశాలే లక్ష్యంగా ట్రంప్ ఈ  నిర్ణయాన్ని ప్రకటించారు.

ఐరోపా దేశాలే టార్గెట్
అమెరికన్ టెక్ కంపెనీలపై పన్నులు విధించేందుకు ఐరోపా దేశాలు త్వరలోనే చట్టాలు తీసుకురావాలని యోచిస్తున్న తరుణంలో ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. అమెరికాకు వస్తువులను పంపే ఏ దేశమైనా ఇలాంటి పన్నులు విధిస్తే, వాటిపై తక్షణమే 100 శాతం టారిఫ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కొత్త నిబంధన గతంలో కుదుర్చుకున్న అన్ని వాణిజ్య ఒప్పందాల కంటే పైన ఉంటుందని, దేనినీ లెక్కచేయబోమని తేల్చి చెప్పారు. ఐరోపా సమాఖ్య (ఈయూ), అమెరికాల మధ్య జూలై 4 నాటికి ఖరారు కావాల్సిన టారిఫ్ ఒప్పందానికి ముందే ఈ హెచ్చరిక రావడం గమనార్హం.

పాత ఒప్పందాలకు చెక్
అమెరికా ఎగుమతులకు అడ్డుకట్ట వేసేలా ఐరోపా దేశాలు విధిస్తున్న కఠినమైన సాంకేతిక, పర్యావరణ నిబంధనలపై ట్రంప్ మొదటి నుంచీ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నిబంధనలన్నీ అమెరికన్ టెక్నాలజీని వివక్షకు గురిచేసేందుకేనని గతంలోనే ఆయన ఆరోపించారు. ఫ్రాన్స్ వస్తువులైన వైన్, షాంపేన్‌లపై 100 శాతం పన్ను వేస్తానని ఈ నెల ప్రారంభంలోనే ట్రంప్ హెచ్చరించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం 2019లోనే ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, గూగుల్ (ఆల్ఫాబెట్) వంటి అమెరికా దిగ్గజాల స్థానిక ఆదాయంపై 3 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.

గ్లోబల్ ట్రేడ్ వార్?
ట్రంప్ తాజా నిర్ణయంతో అంతర్జాతీయంగా మరోసారి వాణిజ్య యుద్ధం (ట్రేడ్ వార్) ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. డిజిటల్ పన్నుల అంశం అమెరికాకు, ఐరోపా దేశాలకు మధ్య ఎప్పటి నుంచో వివాదాస్పదంగా మారింది. అయితే, తాజాగా ట్రంప్ స్పష్టం చేసిన వంద శాతం సుంకాల హెచ్చరిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్‌పై ఆధారపడే పలు దేశాలు ఇప్పుడు తమ డిజిటల్ పన్నుల విధానాలపై పునరాలోచనలో పడ్డాయి.

ఇది కూడా చదవండి: బీజేపీ కీలక పదవిలో రాజ్‌నాథ్ చిన్న కుమారుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement