న్యూఢిల్లీ: హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో (2026–27, క్యూ1) కన్సాలిడేటెడ్ నికర లాభం 3.17 శాతం తగ్గి రూ. 2,680 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.2,768 కోట్లుగా నమోదైంది. పునర్వ్యవస్థీకరణ వ్యయాలు రూ.115 కోట్లతో సహా, రూ.5 కోట్ల కొనుగోలు సంబంధిత ఖర్చుల ప్రభావంతో రూ. 75 కోట్ల అసాధారణ నష్టాన్ని కంపెనీ చవిచూసింది. అలాగే పన్ను వ్యయాలు రూ. 526 కోట్ల నుంచి రూ. 952 కోట్లకు పెరగడం కూడా లాభాలకు కోత పెట్టింది. కాగా, మొత్తం ఆదాయం మాత్రం రూ. 17,149 కోట్లకు ఎగబాకింది.
గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ. 15,552 కోట్లతో పోలిస్తే 10.26 శాతం వృద్ధి చెందింది. ‘క్యూ1లో డిమాండ్ పరిస్థితులు స్థిరంగానే కొనసాగాయి. పటిష్టమైన కంపెనీ బ్రాండ్‌ల దన్నుతో టర్నోవర్ 10 శాతం జంప్ చేయడమే దీనికి నిదర్శనం’ అని హెచ్‌యూఎల్ సీఈఓ, ఎండీ ప్రియా నాయర్ పేర్కొన్నారు. సర్ఫ్ ఎక్సెల్, రిన్, విమ్ తదితర బ్రాండ్‌లతో కూడిన హోమ్ కేర్ విభాగం ఆదాయం 13.44% ఎగసి రూ. 6,554 కోట్లకు చేరింది.
బ్యూటీ, వెల్‌నెస్ విభాగం సెగ్మెంట్ రూ.4,083 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 12.44 శాతం పెరిగింది. ఫలితాల నిరాశతో హెచ్‌యూఎల్ షేరు 7 శాతం పైగా దిగజారి రూ.2,020 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.35,620 కోట్లు ఆవిరై, రూ. 2,75,358 కోట్లకు పడిపోయింది.


