డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరి జీవితంలో ట్యాక్స్ ఒక ముఖ్యమైన అంశం. అయితే.. ఆదాయ పన్ను (Income Tax) ఎలా వచ్చింది? ఎవరు ఎక్కువగా చెల్లిస్తున్నారు? అనే విషయాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దీని గురించి వివరిస్తూ రాబర్ట్ కియోసాకి సుదీర్ఘ పోస్ట్ చేశారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అమెరికా ఆదాయ పన్ను చరిత్రను పరిశీలిస్తే.. మొదట ఇది కేవలం ధనికుల నుంచి మాత్రమే పన్ను వసూలు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది. కానీ.. కాలక్రమేణా ఈ పన్ను విధానం మారుతూ, సాధారణ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలపై కూడా ప్రభావం చూపడం మొదలైంది.
ఆదాయ పన్ను విధానం
1913కు ముందు అమెరికా ప్రభుత్వం ప్రధానంగా వాణిజ్య సుంకాలు, దిగుమతి పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేది. ఆ సమయంలో సాధారణ ప్రజలు తమ జీతాలపై ఫెడరల్ ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ తరువాత అమెరికా రాజ్యాంగంలోని 16వ సవరణ ద్వారా ఆదాయ పన్ను విధానం అమల్లోకి వచ్చింది.
అప్పట్లో.. దీనిని ధనికులపై మాత్రమే విధించే పన్నుగా ప్రజలకు వివరించారు. ప్రారంభ దశలో చాలా ఎక్కువ ఆదాయం ఉన్నవారికే పన్ను వర్తించేది. దీంతో సాధారణ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ధనికులు తమ వాటా చెల్లించడం న్యాయమేనని చాలామంది భావించారు.
పన్ను వ్యవస్థలో మార్పులు
అయితే, సంవత్సరాలు గడిచేకొద్దీ పన్ను వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. పన్ను రేట్లు పెరిగాయి, నియమాలు మారాయి, పన్ను చెల్లించే వారి పరిధి కూడా విస్తరించింది. దీంతో ఒకప్పుడు ధనికులపై మాత్రమే ఉన్న పన్ను భారం క్రమంగా.. మధ్యతరగతి ఉద్యోగులపై కూడా పడింది.
ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించే విషయం ఏమిటంటే.. ఆదాయం వచ్చే విధానం. సాధారణ ఉద్యోగులు తమ శ్రమకు ప్రతిఫలంగా జీతం పొందుతారు. ఈ జీతంపై నేరుగా పన్ను విధించడం జరుగుతుంది. మరోవైపు.. వ్యాపారాలు, పెట్టుబడులు, ఆస్తుల ద్వారా ఆదాయం పొందేవారికి పన్ను చట్టాల్లో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారాలు చేసే వారు ఖర్చుల తగ్గింపులు, ఆస్తుల విలువ తగ్గింపు వంటి పన్ను ప్రయోజనాలను ఉపయోగించుకోగలరు. అందువల్ల సంపదను సృష్టించే మార్గాలను ఎంచుకున్నవారు పన్ను వ్యవస్థలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటారని ఆర్థిక నిపుణులు చెబుతారు.
వారెన్ బఫెట్ ఉదాహరణ
ఈ విషయాన్ని వివరించేందుకు వారెన్ బఫెట్ ఉదాహరణను కూడా ప్రస్తావిస్తారు. తన సెక్రటరీ తనకంటే ఎక్కువ పన్ను రేటు చెల్లించినట్లు ఆయన ఒకసారి చెప్పారు. దీనికి కారణం వారికి ఆదాయం వచ్చే విధానం వేర్వేరుగా ఉండటమే అని వివరించారు.
కేవలం ఎక్కువ సంపాదించడం మాత్రమే కాకుండా, డబ్బు ఎలా వస్తోంది, పెట్టుబడులు ఎలా పనిచేస్తాయి, పన్ను వ్యవస్థ ఎలా ఉంటుంది అనే విషయాలపై అవగాహన కలిగి ఉండటం కూడా ముఖ్యం. అయితే.. పన్ను వ్యవస్థలు ప్రతి దేశంలోనూ ఆ దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, ప్రజల అవసరాల ఆధారంగా మారుతూ ఉంటాయి. ఆదాయ పన్ను ద్వారా ప్రభుత్వాలు రోడ్లు, విద్య, వైద్యం, రక్షణ వంటి ప్రజా సేవలకు అవసరమైన నిధులను సమకూర్చుకుంటాయి.
ఆదాయ పన్ను చరిత్ర మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఆర్థికంగా ఎదగాలంటే.. సంపాదనతో పాటు ఆర్థిక అవగాహన కూడా అవసరం. జీతంపై ఆధారపడే వ్యక్తి.. వ్యాపారం లేదా పెట్టుబడుల ద్వారా సంపాదించే వ్యక్తి ఒకే పన్ను వ్యవస్థలో ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. అందుకే డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా, దాన్ని నిర్వహించడం, ఆర్థిక నియమాలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఇదీ చదవండి: ఇంకా తగ్గనున్న బంగారం ధరలు!


