సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఉండాలని చాలామంది భావిస్తారు. అయితే తాను క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
లక్షలు, కోట్లు లేకుండా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టడం సాధ్యం కాదని అనుకుంటారు. కానీ కియోసాకి వంటి పెట్టుబడిదారులు మాత్రం.. డబ్బు కంటే సరైన ఆలోచన, వ్యూహం ఉంటే అవకాశాలను సృష్టించుకోవచ్చని చెబుతున్నారు.
కియోసాకి తన మొదటి రెంటల్ ప్రాపర్టీని కేవలం 1800 డాలర్లు, క్రెడిట్ కార్డు సహాయంతో కొనుగోలు చేసిన విషయాన్ని వెల్లడించాడు. ఒక మంచి అవకాశం వచ్చిన వెంటనే.. బ్యాంక్ లోన్ కోసం ఎదురుచూడకుండా.. డీల్ పూర్తి చేశానని పేర్కొన్నారు. దీనికోసం తాను సంవత్సరాల తరబడి పొదుపు చేయలేదని కూడా చెప్పారు.
ఆ మొదటి పెట్టుబడి తనకి ఒక పాఠాన్ని నేర్పిందని చెప్పారు. రియల్ ఎస్టేట్‌లో ముందుకు వెళ్లడానికి అసలు సమస్య డబ్బు లేకపోవడం కాదు, సరైన సమాచారం లేకపోవడమే అని అతని అభిప్రాయం. మంచి అవకాశాలను గుర్తించడం, సరైన వ్యూహంతో వాటిని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని వివరించాడు.

రిచ్ డాడ్, పూర్ డాడ్ ఉదాహరణతో.. సంపదను నిర్మించే విధానంలో ఉన్న తేడాను వివరించాడు. సాధారణంగా ఉద్యోగం చేసే వ్యక్తి తన జీవితాంతం జీతం కోసం పనిచేస్తాడు. కానీ పెట్టుబడిదారుడు తనకు నిరంతరం ఆదాయం తెచ్చే ఆస్తులను నిర్మించడానికి ప్రయత్నిస్తాడు అని అన్నారు.
తన మొదటి చిన్న పెట్టుబడినే ఆధారంగా చేసుకుని.. అదే వ్యూహాన్ని కొనసాగిస్తూ చివరకు వేలాది అద్దె యూనిట్ల వరకు తన వ్యాపారాన్ని విస్తరించానని కియోసాకి పేర్కొన్నాడు. ప్రారంభంలో ఉపయోగించిన ఆలోచన మారలేదని, కేవలం దాన్ని మరింత పెద్ద స్థాయిలో అమలు చేశానని తెలిపాడు.
అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. రియల్ ఎస్టేట్‌లో ప్రతి పెట్టుబడికి లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆస్తి విలువ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడిదారులు ఈ విషయాన్ని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి.


